పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ రోజురోజుకూ ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుగా మారుతోంది. లోక నాయకుడు ‘కమల్ హాసన్’ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించకపోయినా కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ‘ప్రాజెక్ట్ కే’లో చేయడంపై కమల్ హాసన్ కూడా స్పందించారు.


ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా...
‘50 సంవత్సరాల క్రితం నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డ్యాన్స్ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు నిర్మాణ రంగంలో అశ్వనీదత్ పేరు ఒక సంచలనం. ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఇద్దరం కలిసి పని చేయబోతున్నాం. మా తర్వాతి తరానికి చెందిన అద్భుత దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్, దీపికా పదుకొనే నా తర్వాతి తరం వారే. అమితాబ్ బచ్చన్‌తో ఇప్పటికే నేను కలిసి పని చేశాను. కానీ ప్రతిసారీ మొదటిసారి లాగానే ఉంటుంది. అమితాబ్ ఎప్పటికప్పుడు కొత్తగా మారుతూనే ఉంటారు. ఈ ప్రక్రియలో నేను కూడా ఉన్నాను.’


‘నేను ప్రాజెక్ట్ కే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నన్ను ప్రేక్షకులు ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా నేను మొదటగా సినిమాలపై ఆసక్తి ఉన్న వ్యక్తినే. ఆ గుణమే నన్ను ప్రతిసారీ కొత్తగా ప్రయత్నించేలా చేస్తుంది. ప్రాజెక్ట్ కేకు మొదటి మెచ్చేకోలు నా నుంచే వెళ్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ ప్రపంచం మొత్తాన్ని మెప్పిస్తుందని నమ్ముతున్నాను.’ అని కమల్ హాసన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


వెల్‌కమ్ కమల్...
దీనిపై అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ‘వెల్‌కమ్ కమల్. మీతో మళ్లీ పని చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటికే చాలా కాలం అయింది.’ అని తెలిపారు. నిర్మాత అశ్వనీ దత్ స్పందిస్తూ ‘కమల్ హాసన్‌తో పని చేయడం నాకెప్పటి నుంచో ఉన్న కల. నా కెరీర్ 50వ సంవత్సరంలో ఇది జరగడం నాకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయం.’ అన్నారు.


మాటల్లో చెప్పలేనంత గౌరవం
హీరో ప్రభాస్ ‘ఈ క్షణం నా హృదయంలో చిరకాలం ఉండిపోతుంది. ప్రాజెక్ట్ కేలో కమల్ హాసన్‌తో పని చేయడం నా మాటల్లో చెప్పలేనంత గౌరవంగా ఫీల్ అవుతున్నాను. సినిమా పరిశ్రమకు చెందిన దిగ్గజంతో పని చేస్తూ నేర్చుకోవడం, ఎదగడం నా కల నిజమైనట్లు అనిపిస్తుంది.’ అన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ ‘కమల్ హాసన్ ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఆయనతో కొత్తగా ఇటువంటి పాత్ర చేయించడం నాకు దక్కిన గౌరవం. ఆయన రాకతో మా ప్రపంచం పరిపూర్ణం అయింది.’ అని పేర్కొన్నారు.