సాధారణంగా టాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు, ప్రీరిలీజ్ ఈవెంట్ ఇలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ ప్రభాస్ సినిమా విషయంలో మాత్రం స్పెషల్ ప్రమోషన్స్ జరుగుతుంటాయి. ఈ పాన్ ఇండియా స్టార్ కోసం జపాన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగుతుంటారు. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ కి జపాన్ లో క్రేజ్ బాగా పెరిగింది. 


సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత జపాన్ లో ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది ప్రభాస్ అనే చెప్పాలి. కొందరు ఫ్యాన్స్ అయితే కేవలం ప్రభాస్ ని కలిసి, ఫొటోలు తీసుకోవడానికి మాత్రమే హైదరాబాద్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే.. ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 'బాహుబలి' తరువాత నుంచి ప్రభాస్ నటించిన ఏ సినిమా విడుదలవుతున్నా.. జపాన్ ఫ్యాన్స్ దృష్టి దానిపై పడుతుంది. 


'సాహో' సినిమా విషయంలో కూడా హడావిడి చేశారు. ఇప్పుడు 'రాధేశ్యామ్' సినిమా కోసం జపాన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. తమదైన స్టైల్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు, హిందీ వెర్షన్ పాటలను పాడుతూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'రాధేశ్యామ్' పాటలకు, టీజర్ కి జపాన్ భాషలో రివ్యూలు రాస్తూ పోస్ట్ చేస్తున్నారు. మరి జపాన్ అభిమానుల కోసం ఈ సినిమాను ఆ భాషలో డబ్ చేస్తారేమో చూడాలి! 


ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయబోతున్నారు. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. 'జిల్‌' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు మూడు వంద‌ల కోట్ల‌ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.