మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తరువాత పాన్ ఇండియా లెవెల్ లో ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాలనుకున్నారు చరణ్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. దీనికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. శంకర్ సినిమా తరువాత సుకుమార్ తో చరణ్ సినిమా చేస్తాడని అంటున్నారు. 


ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ లో ఊర మాస్ మసాలా సినిమాలు తీసే రోహిత్ శెట్టి.. చరణ్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలనుకుంటున్నారట. త్వరలోనే రోహిత్ శెట్టి కథతో చరణ్ ను కలవబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలకు చెందిన రెండు పెద్ద బ్యానర్లు నిర్మించబోతున్నట్లు సమాచారం. 


ఈ ప్రాజెక్ట్ గనుక ఓకే అయితే చరణ్ ని రోహిత్ శెట్టి తెరపై ఎలా చూపిస్తాడోననే ఆసక్తి జనాల్లో కలగడం ఖాయం. రోహిత్ తన కెరీర్ లో 'సింగం', 'సింబా', 'సూర్యవంశీ' లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో పాటు 'చెన్నై ఎక్స్ ప్రెస్' అనే ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ ని కూడా తీశారు. ఇవన్నీ కూడా దర్శకుడిగా అతడి రేంజ్ మరింత పెంచాయి. 


ప్రస్తుతం ఆయన అమెజాన్ ప్రైమ్ కోసం పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. దీనికోసం భారీ పెట్టుబడి పెడుతున్నారు. అలానే బాలీవుడ్ లో ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే పనిలో పడ్డారు. మరి చరణ్ కోసం ఆయన సిద్ధం చేసే కథ మన హీరోకి నచ్చుతుందో లేదో చూడాలి. ఇక చరణ్-శంకర్ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. కొత్త షెడ్యూల్ షూటింగ్ కోసం టీమ్ మొత్తం న్యూజిలాండ్ కి వెళ్లబోతుంది. అక్కడ రామ్ చరణ్, కియారా అద్వానీలపై పాటను చిత్రీకరించనున్నారు. దాదాపు పదిరోజుల పాటు ఈ సాంగ్ ను షూట్ చేయబోతున్నారట. న్యూజిలాండ్ లో రకరకాల ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. నిజానికి మొదట బడ్జెట్ అనుకున్నప్పుడు శంకర్ ఈ పాట గురించి చెప్పలేదట.


ఇప్పుడు ఈ ఒక్క పాట కోసం దిల్ రాజు అదనంగా రూ.8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. శంకర్ సినిమాల్లో పాటలు ఎంత లావిష్ గా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాలు హిట్ అయినా.. అవ్వకపోయినా.. పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. విజువల్స్ వండర్స్ గా నిలుస్తుంటాయి. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా కొన్ని పాటలను అలానే ప్లాన్ చేశారు శంకర్. సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 


ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 


Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా, తేదీ ప్రకటించిన ఓం రౌత్ - రీషూట్ కోసమేనా?