IND vs SL: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్నమూడు మ్యాచ్‌ల T20 సిరీస్ 1-1తో సమం అయింది. ఇప్పుడు సిరీస్‌లో మూడో మ్యాచ్‌ రెండు జట్లకు 'డూ ఆర్ డై'గా మారింది. ఈ చివరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ఒక పెద్ద రికార్డుకు కేవలం ఐదు పరుగులు దూరంలో ఉన్నాడు. అతను ఈ విషయంలో భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మను దాటేయగలడు.


ఇప్పటి వరకు భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. అతను ఇప్పటివరకు 19 మ్యాచ్‌లలో 17 ఇన్నింగ్స్‌లు ఆడి 24.17 సగటుతో, 144.21 స్ట్రైక్ రేట్‌తో 411 పరుగులు చేశాడు. శ్రీలంక కెప్టెన్ షనక భారత్‌తో జరిగిన 21 టీ20 మ్యాచ్‌లలో 19 ఇన్నింగ్స్‌లు ఆడి 31.30 సగటుతో, 141.31 స్ట్రైక్ రేట్‌తో 407 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాలంటే ఇప్పుడు దసున్ షనకకు కేవలం ఐదు పరుగులు మాత్రమే కావాలి.


తర్వాతి మ్యాచ్‌లో రికార్డ్ బ్రేక్?
ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లోని రెండో టీ20 మ్యాచ్‌లో షనక 56 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తీరు చూస్తుంటే మూడో టీ20 మ్యాచ్‌లోనే అతను ఈ భారీ రికార్డును సాధిస్తాడని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసిన దసున్ షనక అజేయంగా నిలిచాడు.


రాజ్‌కోట్‌లో  ఈ'డూ ఆర్ డై' మ్యాచ్
సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత జట్టు రెండు పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.