పరంధామయ్య గుడిలో ప్రసాదం ఇవ్వమని బతిమలాడటం తులసి, సామ్రాట్ చూస్తారు. లాస్య అంకితని ఏడిపించినందుకు తెగ సంతోషపడుతుంది. అప్పుడే బెనర్జీ లాస్యకి ఫోన్ చేస్తాడు. తన దగ్గర అల్టిమేట్ ప్రాజెక్ట్ ఉందని అది ఎగ్జిక్యూట్ చేయాలని అడుగుతాడు. ఆఫీసుకి వస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందామని అంటాడు. దీంతో లాస్య బెనర్జీని కలిసేందుకు వెళ్తుంది. కప్పు ప్రసాదం అడిగినందుకు అంతగా అరుస్తాడా అని అనసూయ కోపంతో రగిలిపోతుంది. వాళ్ళు మాట్లాడుకోవడం తులసి వింటూనే ఉంటుంది.


పరంధామయ్య: ఇంట్లో లాస్య అవమానాలు పడీ పడీ ఆత్మాభిమానం చచ్చిపోయిందేమో. లాస్య చేసిన అవమానం ముందు వీడు అన్న మాటలు చిన్నగా అనిపించాయోమో. తులసి మనల్ని చంటి పిల్లల్లా చూసుకుంది. ఈరోజు మనల్ని బాధపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు కాఫీ కూడా తాగలేని పరిస్థితి, డికాషన్ తాగాల్సి వస్తుంది.


అనసూయ: మీకు షుగర్ డౌన్ అయ్యింది ర్యాక్ తాళాలు ఇవ్వమంటే తెల్లారే చూసుకుందామని నా మొహాన తలుపు వేసింది. ఆ క్షణంలో అనిపించింది ఎందుకు బతికి ఉన్నానా అని. బాధని దిగమింగుకోవాలని మీరు నా నోరు నొక్కేశారు. కనీసం తులసికి అయిన మన కష్టాలు తెలియాలి కదా


Also Read: 'ఐ లవ్యూ శ్రీవారు' అని ప్రేమలేఖ రాసిన వేద- యష్ తనని భార్యగా అంగీకరిస్తాడా?


పరంధామయ్య: తెలుసుకుని ఏం చేస్తుంది మన పక్కన కూర్చుని బాధపడటం తప్ప. ఎప్పటికైనా మంచి జరగకపోదా అని ఎదురుచూద్దాం. ఈ విషయాలు తులసికి తెలియనివ్వకు, మనం తనకి భారం కాకూడదు. ఈ గుడి కాకపోతే ఇంకొక గుడి కడుపు నింపుకోవడానికి ప్రసాదం దొరక్కపోతుందా


అనసూయ: ఇలా తయారైంది ఏంటి మన పరిస్థితి. దానం చెయ్యడం తప్ప ఎదురు చూసింది లేదు


పరంధామయ్య: ఈరోజు మనం కోడలికి భారం అయ్యాం. భూమికి భారం అయ్యేంత వరకు పడుతూ లేస్తూ బతకాల్సిందే అని అంటాడు. ఆ మాటలు అన్ని తులసి విని కుమిలి కుమిలి ఏడుస్తుంది. సామ్రాట్ వాళ్ళ దగ్గరకి వెళ్లబోతుంటే ఆపి పక్కకి తీసుకుని వెళ్ళిపోతుంది. లాస్య రెడీ అయి బెనర్జీని కలవడానికి వెళ్లబోతుంటే నందు ఎదురుపడతాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు. కానీ లాస్య మాత్రం చిరాకుగా ఫ్రెండ్ ని కలవడానికి అని అబద్ధం చెప్తుంది.


వాళ్ళు అంత బాధపడుతుంటే చూస్తూ ఎందుకు ఉండిపోయారు, నేను అయితే వాళ్ళని ఇటు నుంచి ఇటే తీసుకుని వెళ్లిపోయేవాడిని అని సామ్రాట్ అంటాడు. బంధాలు కలపాలంటే కొన్ని తట్టుకోవాలి. కుటుంబం కలిసి ఉండాలంటే ఇవన్నీ తప్పదు, దీనికి ఒక పరిష్కారం చేస్తాను అని అంటుంది. లాస్య చేసేవి నందగోపాల్ కి తెలియదు అనుకుంటున్నా తను ఎలా చేస్తుందో నేను అలాగే చేస్తాను అని అంటుంది. లాస్య బెనర్జీని కలుస్తుంది. కాసేపు బెనర్జీ లాస్యని మునగ చెట్టు ఎక్కించేందుకు ట్రై చేస్తాడు. ఎన్నో కంపెనీలు ఉండగా తాడు బొంగరం లేని నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారని అడుగుతుంది. మీరు చాలా కెపబుల్ అని చెప్తాడు. సామ్రాట్ రిజెక్ట్ చేసిన స్కూల్ ప్రాజెక్ట్ లాస్యని చెయ్యమని అడుగుతాడు.


Also Read: లాస్య బండారం బయటపెట్టిన శ్రుతి, అంకిత- ఉగ్రరూపం దాల్చిన నందు


తులసి సరుకులు తీసుకుని నందు వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడే లాస్య కూడా ఇంటికి వచ్చి సరుకులు చూసి ఏంటని అడుగుతుంది. నాకు చెప్పకుండా ఎవరు తెప్పించారని లాస్య అరుస్తుంది. మా ఇంట్లో నీ పెత్తనం ఏంటి నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్ అని అరుస్తుంది.


తులసి: ఈ సరుకులన్నీ నా డబ్బులతో నేనే తీసుకొచ్చాను. ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు నేనే తెచ్చాను


నందు: ఈ ఇంటికి కావలసినవి తీసుకురావాల్సిన అవసరం నీకు ఏంటి?


తులసి: నా వాళ్ళు ఇంట్లో తిండికి ఇబ్బంది పడకూడదని తీసుకొచ్చాను


నందు: కల గన్నావా? తిండికి ఇబ్బంది పడుతున్నారని ఎవరు చెప్పారు. వాళ్ళ దృష్టిలో నన్ను కించపరచాలని చూస్తున్నావా అసలు ఏంటి నీ ఉద్దేశం. అవి నీ ఇంటికి తీసుకెళ్లు లేదంటే బయట విసిరేస్తాను


తులసి: ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు చూపిస్తాను


తన బండారం బయట పెట్టాలని చూస్తుందని లాస్య అనుకుని తులసిని వెళ్లిపొమ్మని చెప్తుంది. కానీ నందు మాత్రం అడ్డుపడకు ఏంటో చూద్దామని అంటాడు. తులసి కావాలని కాఫీ ఇవ్వమని అడుగుతుంది. కాఫీ పెట్టలేమని ఫ్రిజ్ తో సహా కిచెన్ లో అన్నింటికీ తాళాలు వేసి వాటి కీస్ లాస్య దగ్గర ఉంటాయని అంకిత చెప్పడంతో నందు షాక్ అవుతాడు.