ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు శ్రీసింహ.. 'యమదొంగ' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమై.. 'మత్తువదలరా' సినిమాతో హీరోగా మారారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకొని తన టాలెంట్ నిరూపించుకున్నారు. ఆ తరువాత నటించిన 'తెల్లవారితే గురువారం' సినిమా ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ హీరో 'దొంగలున్నారు జాగ్రత్త' అనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. 

 

ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో సతీష్ త్రిపుర అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈరోజు శ్రీసింహ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. 

 

రోడ్డు, మ్యాప్స్, కారు, సీసీ టీవీ కెమెరా వీటన్నింటీ మధ్య గట్టిగా అరుస్తూ కనిపించారు శ్రీసింహ. ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో తమిళనటుడు సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా.. యశ్వంత్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక కీరవాణి తన సినిమా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన కుమారుడి సినిమా కథల ఎంపిక విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆయన ఓకే చేసిందేనట. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.