తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న నిర్మాతల్లో 'దిల్' రాజు (Dil Raju) ఒకరు. ఆయన నిర్మాత మాత్రమే కాదు... తెలుగు రాష్ట్రాల్లో బలమైన నెట్వర్క్ కలిగిన డిస్ట్రిబ్యూటర్ కూడా! స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరెవరు ఉన్నారు? అని చూస్తే... నాలుగైదు పేర్లు మాత్రమే కనబడతాయి. ఈ సంక్రాంతితో తెలుగులో కొత్తగా మరో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ఓపెన్ చేశారు. 'దిల్' రాజుతో పడకపోవడం వల్ల ఆఫీసు ఓపెన్ చేశారని గుసగుసలు వినిపించాయి. అసలు, డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏమిటి? అని బాలకృష్ణ (Nandamuri Balakrishna) అడిగారు. 'దిల్' రాజు పేరు ఎక్కడా తీయలేదు గానీ ఆ ప్రశ్న వెనుక ఉద్దేశం మాత్రం అదేనని ఇండస్ట్రీ డిస్కషన్. అసలు వివరాల్లోకి వెళితే...
సంక్రాంతికి విడుదలైన గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా 'వీర సింహా రెడ్డి'ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన 'వాల్తేరు వీరయ్య'ను కూడా! ఈ రెండు సినిమాలను నైజాంలో వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 2'కు నిర్మాతలు ఇద్దరూ వచ్చారు.
''రవి గారూ... ఇది మీరు చెప్పాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు పెట్టారు. కాన్ఫిడెన్సా? కాంపిటీషనా?'' అని బాలకృష్ణ అడిగారు. ''అటువంటిది ఏమీ లేదు సార్! మేం ఎక్కువ సినిమాలు చేస్తున్నాం కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కూడా మనమే చేయగలం అనుకున్నాం. మన దగ్గర సినిమాలు ఉన్నాయని దిగడం తప్పితే... కాన్ఫిడెన్స్ కాదు, కాంపిటీషన్ కాదు'' అని రవి శంకర్ యలమంచిలి సమాధానం ఇచ్చారు. ''వెరీ గుడ్ అండీ! ఇండస్ట్రీలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకుని వస్తున్నారు. నేను అది చెప్పగలను'' అని బాలకృష్ణ అభినందించారు.
Also Read : డిస్ట్రిబ్యూషన్ గొడవ... 'వారసుడు' వాయిదా వేసినా పవర్ చూపించిన 'దిల్' రాజు
'వరంగల్' శ్రీను వంటి వ్యక్తులు, కొంత మంది చిన్న నిర్మాతలు 'దిల్' రాజు మీద విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తమ సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదని! సంక్రాంతికి ముందు వరకు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదని అభిమానులు సైతం విరుచుకుపడ్డారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు కాకుండా వేరే నిర్మాతలు కూడా మాట్లాడారు. తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వాలంటూ!
'వారసుడు'ను వాయిదా వేసి... 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలకు థియేటర్లు ఇచ్చారనుకోండి. అది వేరే విషయం. దాన్ని పక్కన పెడితే... మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ గురించి ఓ ఇంటర్వ్యూలో 'దిల్' రాజు స్పందించారు. రెండేళ్ళ తర్వాత ఆ ఆఫీసు ఉంటే మాట్లాడుకుందామని చెప్పారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అర్థం అవుతుందనే రీతిలో చెప్పుకొచ్చారు. మొత్తం మీద డిస్ట్రిబ్యూషన్ గురించి మరి కొన్ని రోజులు చర్చ జరిగే అవకాశం పుష్కలంగా కనబడుతోంది. సంక్రాంతికి మాత్రమే కాదు... ఫిబ్రవరిలో మహా శివరాత్రి సందర్భంగా విడుదల అయ్యే సినిమాల మధ్య కూడా పోటీ నెలకొనేలా ఉంది.
Also Read : ప్రజలు ఎన్నుకున్న వెధవలు, బుద్ధి తెచ్చుకోండి - ఏపీ ప్రభుత్వంపై వీర లెవల్‌లో బాలకృష్ణ సినిమాలో సెటైర్స్?