టాలీవుడ్ టాప్ సినీ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన తమిళ నటుడు దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమాను నిర్మిస్తున్నారు. అదే సినిమాను తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా దిల్ రాజు వివాదంలో చిక్కుకున్నారు. గతంలో సినిమా షూటింగ్ లు బంద్ సమయంలో అందరూ సినిమా షూటింగ్ లు నిలిపి వేస్తే దిల్ రాజు మాత్రం వారుసుడు సినిమా షూటింగ్ చేయడం, ఇదేమని అడిగితే అది తమిళ సినిమా అని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. దీంతో నిర్మాతల మండలి తమిళ సినిమాలకు తెలుగులో థియేటర్లను కేటాయించకూడదని నిర్ణయం తీసుకోవడవంతో వివాదం ముదిరింది. గత కొన్ని వారాలుగా ఇది కొనసాగుతోంది. అయితే దీనిపై చాలా వార్తలు వస్తున్నప్పటికీ దిల్ రాజు మాత్రం స్పందించలేదు. ఎప్పటిలానే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ‘వారసుడు’ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో వైపు దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబోలో భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు దిల్ రాజు.
ప్రస్తుతానికి చిరంజీవి నటిస్తోన్న‘వాల్తేరు వీరయ్య’ బాలకృష్ణ నటిస్తోన్న‘వీర సింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికి విడుదల చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే విడుదల తేదీలను మాత్రం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ‘వారసుడు’ సినిమాను జనవరి 12న విడుదల చేయాలని చూస్తున్నారట దిల్ రాజు. మరోవైపు చిరంజీవి, బాలయ్యలను నొప్పించకుండా ఉండేందుకు ప్రణాళికలు చేస్తున్నారట. ఒకవేళ ‘వారసుడు’ కోసం ఎక్కువ థియేటర్లను బ్లాక్ చేస్తే దిల్ రాజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఆయన సిద్దంగా లేరని తెలుస్తోంది. అందుకే విజయ్ కు ఉన్న మార్కెట్ ప్రకారం థియేటర్లను కేటాయించాలని డిస్టిబ్యూటర్లను కోరుతున్నారట. ఇక్కడ పరిస్థితి గురించి ఇప్పటికే విజయ్ కు వివరించారట. మొత్తానికి దిల్ రాజు ‘వారసుడు’ సినిమా విడుదలకు పక్కా ప్రణాళిక రచిస్తున్నారనే తెలుస్తోంది.
అయితే ఇటీవల దిల్ రాజు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను సినమాలను తొక్కేస్తాను అని చాలా మంది అంటుంటారని, కానీ తనలో ఇంకో సైడ్ ఉందని అన్నారు దిల్ రాజు. మంచి కంటెంట్ సినిమాలు చేసేవారి కోసం తాను ఏదైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ‘లవ్ టుడే’ సినిమాను తెలుగులో డబ్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే అందులో తనకు మిగిలేది ఏమీ ఉండదని కేవలం సినిమాపై ప్రేమతోనే విడుదల చేస్తున్నా అని అన్నారు. అసలు ‘వారసుడు’ సినిమా విషయంలో ఏం జరిగిందనేది త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వివాదం ఎటునుంచి ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
Also Read: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!