Devil Release Date: విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకుల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మాత‌గా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున ‘డెవిల్’ విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.


పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘డెవిల్’ తెరకెక్కుతోంది. బ్రిటీష్‌ వారు భారతదేశాన్ని ప‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌టంతో 1940ల కాలం నాటి ప‌రిస్థితుల‌ను ఆవిష్కరించేలా భారీగా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను చిత్రీక‌రించారు. న‌టీన‌టుల వ‌స్త్రాలంక‌ర‌ణ మాత్రం భార‌తీయ‌త‌ను ప్ర‌తిబింబించేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. క‌ళ్యాణ్ రామ్‌ ఇందులో గూఢ‌చారిగా క‌నిపించ‌బోతున్నారు. ఇలాంటి పాత్ర‌ను కళ్యాణ్ రామ్ చేయ‌టం ఇదే మొద‌టిసారి. దీంతో ద‌ర్శ‌క నిర్మాత అభిషేక్ నామా, కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ , క‌ళ్యాణ్ రామ్ లుక్‌ స‌రికొత్త‌గా ఉండేలా డిజైన్ చేశారు. 


దీని గురించి కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ మాట్లాడారు. ‘అభిషేక్ నామా డెవిల్ స్క్రిప్ట్ నాకు వివరించ‌గానే హీరో లుక్ కొత్త ఉండాల‌ని అర్థ‌మైంది. ఇందులో హీరో ఇండియన్ అయిన‌ప్ప‌టికీ బ్రిటీష్ వారి కోసం గూఢ‌చారిగా ప‌ని చేస్తుంటారు. ఆయ‌న పాత్రను బాగా ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయాల‌నుకున్నాను. డెవిల్‌ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న ధోతి కట్టుకుని ఉంటారు. దాని పైన ఒక వెయిస్ట్‌ కోటుని ధ‌రించి ఉంటారు. ఆయ‌న కాస్ట్యూమ్స్‌లో భార‌తీయ‌త క‌నిపించేలా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం.’ అన్నారు.  


కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ కాస్ట్యూమ్స్ హైలైట్స్‌ ఇవే


* ‘డెవిల్’ కోసం క‌ళ్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించారు. 
* ఇట‌లీ నుంచి తెప్పించిన‌ ప్రత్యేకమైన మోహైర్ ఊల్‌తో 60 బ్లేజ‌ర్స్‌ను స్పెషల్‌గా తయారు చేశారు.
* వెయిస్ట్ కోటుతో పాటు దేశీయ‌ కాట‌న్‌తో కుర్తా, ధోతిని కూడా ప్రత్యేకంగా తయారు చేశారు.
* బ్లేజ‌ర్‌, కుర్తా, ధోతి... ఇలా ప్ర‌తీ కాస్ట్యూమ్ కోసం 11.5 మీట‌ర్ల ఫ్యాబ్రిక్‌ను ఉప‌యోగించారు.
* హీరోని స్టైల్‌గా చూపించేందుకు 25 ప్ర‌త్యేక‌మైన‌ వెయిస్ట్ కోట్స్‌ను కూడా ఉప‌యోగించారు.
* కళ్యాణ్ రామ్ వేసుకునే బ్లేజ‌ర్ జేబు ప‌క్క‌న వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్ వాచ్‌ను ప్ర‌త్యేకంగా రూపొందించారు.
* ఢిల్లీలోని ఒక వ్యక్తికి పురాత‌న వాచీల‌ను సేక‌రించే అలవాటు ఉందని తెలుసుకుని, అత‌ని ద‌గ్గ‌ర నుంచి ఈ హ్యాంగింగ్ వాచ్‌ను తీసుకువచ్చారు.


కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్‌కి ‘డెవిల్’ 60వ చిత్రం కావడం విశేషం. నందమూరి క‌ళ్యాణ్ రామ్‌తో ఇది ఏకంగా ఆరో సినిమా. గతంలో ఎంఎల్‌ఏ, 118, ఎంత మంచివాడ‌వురా చిత్రాలకు కూడా రాజేష్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఆయ‌న తర్వాత నటించనున్న మూడు సినిమాలకూ రాజేష్‌నే వ‌ర్క్ చేస్తున్నారు.