Women’s Came In Tractors For Devara: ‘దేవర‘ సినిమాకు మాస్ ప్రేక్షకుల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది. దసరా పండుగ వేళ ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్లకు పోటెత్తుతున్నారు. సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత కాస్త ప్రేక్షకుల తాడికి తగ్గినా, పండుగ వేళ మళ్లీ క్యూ కడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ అనే తేడా లేకుండా థియేటర్లకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది.
ట్రాక్టర్లలో సినిమాకు తరలి వస్తున్న ప్రేక్షకులు
‘దేవర‘ సినిమా చూసేందుకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఏకంగా ట్రాక్టర్లు కట్టుకుని సినిమా కోసం జనాలు తరలి వస్తున్నారు. తాజాగా ఏపీలోని మదనపల్లెలో ‘దేవర’ థియేటర్లకు పల్లెటూర్ల నుంచి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ట్రాక్టర్లు ఎక్కి ఈ సినిమా చూసేందుకు రావడంతో థియేటర్ల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అటు తమ అభిమాన నటుడి సినిమా చూసేందుకు ట్రాక్టర్ల మీద రావడం హ్యాపీగా ఉందంటున్నారు జనాలు. ట్రాక్టర్ల మీద థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ సినిమా అంటే ఆమాత్రం ఉంటుంది అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. దసరా వేళ థియేటర్లకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావడం పట్ల ‘దేవర’ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘దేవర’ సినిమా గురించి..
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలకు తగినట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సత్తా చాటింది. ఈ సినిమా రూ. 500 కోట్ల మార్కును దాటేసింది. దసరా నేపథ్యంలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు.
అప్పట్లో ‘అఖండ’ సినిమాకు ట్రాక్టర్ల మీద తరలి వచ్చిన ప్రేక్షకులు
కరోనా తర్వాత బాలయ్య హీరోగా నటించిన ‘అఖండ’ సినిమా చూసేందుకు సైతం ప్రేక్షకులు ట్రాక్టర్ల మీద వచ్చారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సినిమా విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రథం పట్టారు. సినిమాను చూసేందుకు ఏకంగా ట్రాక్టర్లను కట్టుకుని థియేటర్లకు తరలి వచ్చారు. గుంటూరు సహా పలు జిల్లాల్లో మహిళలు ట్రాక్టర్లలో థియేటర్లకు వచ్చి బాలయ్యపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒకప్పుడు ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసేవాళ్లు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ మొదలయ్యింది.
Read Also: అమితాబ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే రజనీది లాస్ట్ బెంచ్ - వేట్టయన్ దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్