ఒక్క ఎక్స్ ప్రెషన్ తో ఇట్టే నవ్వించేస్తారు బ్రహ్మానందం. అందుకే ఆయన్ను కామెడీ కింగ్, నవ్వుల రారాజు, హాస్యబ్రహ్మ ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. ఈరోజు ఆయన 66వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రముఖ  జంధ్యాల ఆయన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్ లోని సత్తెన్నపల్లిలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. చదువు పూర్తయిన తరువాత అత్తిలిలో కాలేజ్ లెక్చరర్ గా పని చేశారు. అదే సమయంలో ఆయనకు జంధ్యాల గారు సినిమాలో అవకాశం ఇచ్చారు. 


నరేష్ హీరోగా నటించిన తాతావతారం సినిమాలో నటించారు బ్రహ్మానందం. ఆ తరువాత జంధ్యాల గారు రూపొందించిన పలు సినిమాల్లో కమెడియన్ గా కనిపించారు బ్రహ్మి. అందులో 'అహ నా పెళ్లంట' సినిమాలో బ్రహ్మానందం కామెడీని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అరగుండు అవతారంలో ఆయన నటనకు జనాలు పగలబడి నవ్వారు. 


ఆ సినిమా తరువాత బ్రహ్మానందం కెరీర్ మలుపు తీసుకుంది. స్టార్ హీరో సినిమా అంటే అందులో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే. బ్రహ్మి డేట్స్ ని బట్టి స్టార్ హీరోలు షూటింగ్ అడ్జస్ట్ చేసుకున్న రోజులు చాలానే ఉన్నాయి. రోజుకి 18 గంటలు పని చేస్తూ.. ఇప్పటివరకు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఈ జెనరేషన్ వాళ్లకు కూడా బ్రహ్మానందం హాట్ ఫేవరెట్. సోషల్ మీడియాలో ఆయనకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. బ్రహ్మానందం మీమ్ వేయకపోతే మీమర్స్ కి ఆరోజు గడవదు. 


బ్రహ్మానందం మంచి కమెడియన్ మాత్రమే కాదు.. మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఆయన మిమిక్రీను చాలా ఎంజాయ్ చేస్తానని ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సైతం చెప్పారు. కమెడియన్ గా ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2010లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు బ్రహ్మానందం. ఇప్పుడు సినిమాలను తగ్గించి తనలోని కళా నైపుణ్యానికి పదునుపెట్టారు. అలానే 'మై ఎక్స్ పీరియన్స్ విత్ గాడ్' అనే పుస్తకాన్ని రాస్తున్నారు. 


ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన తను రాష్ట్రపతి భవన్ కి వెళ్లి పద్మశ్రీ అవార్డు అందుకోగలిగానంటే దానికి తన కష్టం ఒక్కటే కారణం కాదని.. ఇలాంటి స్థితి కల్పించింది దేవుడే అని అంటారు బ్రహ్మానందం. అందుకే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పేపర్ పై రాయాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల చెప్పారు బ్రహ్మి. ఆ పుస్తకం చదివి బ్రహ్మానందం అనేవాడు ఒకడుండేవాడు.. వాడు దేవుడిని నమ్ముకున్నాడు.. మనం కూడా నమ్ముకుందామని ఒక్కరైనా అనుకోవాలని.. అందుకే పుస్తకం రాస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 


అందరినీ కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందంను ఎవరు నవ్విస్తారో తెలుసా..? ఆయన మనవడు పార్ధు. తన మనవడికి ఏదైనా చెబుతామని అనుకున్నప్పుడు.. 'తాత నీకు తెలియదు నువ్ ఊరుకో..' అని విసుక్కుంటాడట. మనవడితో అలా అనిపించుకోవడం తనకు నచ్చుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బ్రహ్మి. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ సమయం పార్ధుతోనే గడుపుతున్నట్లు చెప్పారు. ఆయన ఇలానే నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ.. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం!