Why Do Lawrence Bishnoi Targets Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు ఘటన గురించి ఇప్పటికీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఇక దీని గురించి రోజురోజుకీ ఒక కొత్త విషయం బయటపడుతోంది. ముందుగా సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారే విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21). వీరిద్దరి దగ్గర నుండి దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికీ వీరిద్దరూ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్‌కు చెందినవారే అన్న విషయం బయటపడినా.. అసలు సల్మాన్ ఇంటిపై దాడి ఎందుకు చేశారు అని పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ప్రాణం తీయడానికా?


ఇప్పుడు మాత్రమే కాదు.. దాదాపు రెండేళ్ల నుండి సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నాయ్. పలుమార్లు ఓపెన్‌గా సల్మాన్‌కు వార్నింగ్ కూడా పంపించాడు. ఇప్పుడు ఏకంగా ఇంటి దగ్గర కాల్పులు జరపడానికి ఇద్దరు వ్యక్తులను రంగంలోకి దించాడు. అయితే అసలు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద సల్మాన్ కాల్పులు ఎందుకు చేయించాడు? కేవలం బెదిరించడానికా? లేదా నిజంగానే ప్రాణం తీయడానికా? అని పోలీసులు బయటపెట్టారు. నిందితులు అయిన విక్కీ, సాగర్ చెప్పినదాని ప్రకారం.. కృష్ణజింకను వేటాడిన కేసు విషయంలో సల్మాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని లారెన్స్ బిష్నాయ్ ఎదురుచూస్తున్నాడట. 


జింకలను గురువుగా భావించే కమ్యూనిటీ..


ఇంతకీ సల్మాన్ ఖాన్ కృష్ణజింక వేట కేసుకు, లారెన్స్ బిష్నాయ్‌కు ఏంటి సంబంధం అంటే.. జోధ్‌పూర్‌కు చెందిన బిష్నాయ్ కమ్యూనిటీకి చెందినవారు కృష్ణజింకను చాలా గౌరవంగా చూసుకుంటారు. అది వారి గురువు అయిన గురు భగవాన్ జంబేష్వర్ అలియాస్ జంబాజీ.. పునర్జన్మ అని భావిస్తుంటారు. ఈ విషయంపైనే మాజీ ఎంపీ, బిష్నాయ్ సమాజ్ అధినేత అయిన జశ్వంత్ సింగ్ బిష్నాయ్.. ‘‘జింక.. మా గుర్తింపు, వాటిని బ్రతికించుకోవడం మాకు చాలా అవసరం’’ అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. అలా ఒక కమ్యూనిటీ అంతా కలిసి జింకను దైవరూపంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగా.. సల్మాన్ వచ్చి అదే జింకను వేటాడాలని చూశాడు. ఈ విషయంపై తనపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నా కూడా లారెన్స్ బిష్నాయ్ కోపం మాత్రం ఇంకా తగ్గలేదు.


ఇప్పటికే రెండుసార్లు..


1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణజింకలను వేటాడి చంపాడని ఆరోపణలు ఎదుర్కున్నాడు. దీంతో తనపై 1972 వైల్డ్‌ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం.. సెక్షన్ 9/51 కేసు నమోదయ్యింది. 2018లో ఈ కేసు విషయంపై కోర్టుకు హాజరయిన సల్మాన్ ఖాన్‌పై మొదటిసారి ఓపెన్‌గా దాడి చేయించాడు లారెన్స్ బిష్నాయ్. ఆ తర్వాత 2022లో తన గ్యాంగ్‌లో ఒకడైన సంపత్ నెహ్రాను సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడానికి పంపించాడు. ఇక తాజాగా జరిగిన దాడి విషయంలో కూడా లారెన్స్ బిష్నాయ్ తమ్ముడు అన్మోల్ బిష్నాయ్.. బాధ్యత అంతా తమదే అంటూ ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించాడు.



Also Read: సల్మాన్‌పై కాల్పులు జరిపేందుకు అంత చెల్లించారట - ఫుల్ అమౌంట్ తీసుకోకుండానే దొరికిపోయారు!