గత కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ కి ఓపెన్ థ్రెట్ ఇస్తూ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్. పదేళ్లుగా జైల్లో ఉంటున్న లారెన్స్ అప్పుడెప్పుడో కృష్ణ జింకను వేటాడిన ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్ ను చంపుతానంటూ కొన్ని ఏళ్ల నుంచి ఆయన వెంటపడుతున్నాడు. చంపేస్తానని బెదిరించడమే కాకుండా రీసెంట్ గా సల్మాన్ ఆప్తమిత్రుడు బాబా సిద్ధిఖీని కూడా హత్య చేశామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించి, భయాందోళనలను రేకెత్తించింది. ఇలా బాలీవుడ్ ను షేక్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న లారెన్స్ బిష్ణోయ్ పై తాజాగా వెబ్ సిరీస్ రాబోతోంది.
లారెన్స్ బిష్ణోయ్ బయోపిక్ టైటిల్ ఇదే
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా లారెన్స్ బిష్ణోయ్ గురించే చర్చ నడుస్తోంది. సుమారు 40 క్రిమినల్ కేసులు ఉండగా, లారెన్స్ బిష్ణోయ్ 2014 నుంచి జైల్లోనే ఉంటున్నాడు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపుల విషయంలో వార్తల్లో నిలిచిన లారెన్స్ బిష్ణోయ్ పై వెబ్ సిరీస్ రాబోతుందన్న వార్త తాజాగా సంచలనగా మారింది. ఈ సిరీస్ ను జానీ ఫైర్ ఫాక్స్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతుందని తెలుస్తోంది. ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి, దాని టైటిల్ కి ఓకే చెప్పినట్టుగా టాక్ నడుస్తోంది. ఓ సాధారణ పంజాబీ యువకుడు అతి చిన్న వయసులోనే గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదిగాడు? అన్న విషయాన్ని ఈ సిరీస్ ద్వారా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా నిర్మించబోతున్న ఈ సిరీస్ కి సదరు ప్రొడక్షన్ హౌస్ "లారెన్స్ : ఎ గ్యాంగ్స్టర్ స్టోరీ" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీపావళికి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే జానీ ఫైర్ ఫాక్స్ ఫిలిమ్స్ ఇలాంటి సెన్సేషనల్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ "కరాచీ టు నోయిడా", "ఎ టైలర్ మర్డర్ స్టోరీ" వంటి ప్రాజెక్టులు చేశారు. "కరాచీ టు నోయిడా" అనేది పబ్జీలో పరిచయం అయిన సచిన అనే అబ్బాయి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన సీమా హైదర్ అనే అమ్మాయి స్టోరీ. ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్య లాల్ సాహు లైఫ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా "ఎ టైలర్ మర్డర్ స్టోరీ".
ఇక ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ గా మారిన లారెన్స్ బిష్ణోయ్ స్టోరీతో తెరపైకి రాబోతున్నామని చెప్పుకొచ్చారు జానీ ప్రొడక్షన్స్. దీంతో కాలేజీ రోజుల్లోనే గ్యాంగ్ స్టర్ గా మారిన లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు 700 మందిని రిక్రూట్ చేసుకొని గ్యాంగ్ స్టర్ గా ఎదగడం వంటి అంశాలను ఈ వెబ్ సిరీస్ లో ఎలా చూపించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆర్జీవీ కంటే ముందున్న ప్రొడక్షన్ హౌస్
నిజానికి గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న వరుస ట్వీట్స్ చూస్తుంటే ఆయన లారెన్స్ బయోపిక్ రూపొందించబోతున్నాడా అన్న అనుమానాలు కలిగాయి. అయితే ఆయన కంటే ముందే జానీ ప్రొడక్షన్ హౌస్ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేయడం విశేషం. మరి ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సైలెంట్ అవుతారా? లేదంటే తనదైన శైలిలో లారెన్స్ బిష్ణోయ్‌పై సినిమాను తీస్తారా అనేది చూడాలి.