విశ్వక్ సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించారు. గతంలో ఆయన 'ఫలక్‌నుమా దాస్'కు కూడా దర్శకత్వం వహించారు.
Cult Review - కల్ట్ రివ్యూ: స్క్విడ్ గేమ్ టైపులో... దర్శకుడిగా, హీరోగా విశ్వక్ సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
Cult Review Telugu: విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కల్ట్'. స్క్విడ్ గేమ్ తరహాలో తీసిన ఈ సినిమా ఎలా ఉంది?

- గోవా హోంమంత్రి కొడుకు పుట్టినరోజు పార్టీలో ప్రమాదం మొదలు.
- బొమ్మ ఆజ్ఞలతో మనుషుల ప్రాణాలతో ఆడుతున్నది ఎవరు?
- డీఎస్పీ విశ్వక్ సేన్ ఇంటిలో ఉండి ఎలా కాపాడాడు?
- దర్శకుడిగా విశ్వక్ సేన్ తన మార్కును చూపలేకపోయారు.
Vishwak Sen Cult Movie Telugu Review: యువ కథానాయకుడు విశ్వక్ సేన్‌లో ఓ దర్శకుడు కూడా ఉన్నారు. ఇంతకు ముందు 'ఫలక్‌నుమా దాస్'కు దర్శకత్వం వహించారు. 'మెకానిక్ రాకీ', 'లైలా', 'ఫంకీ' పరాజయాల తర్వాత విజయం కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టారు. హీరోగా నటిస్తూ... 'కల్ట్'కు దర్శకత్వం వహించారు. 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి సినిమా ఎలా ఉంది?
కథ (Cult Movie Story): ఫిబ్రవరి 29న గోవా హోంశాఖ మంత్రి (మురళీ శర్మ) తనయుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) పుట్టినరోజు. నాలుగేళ్ళకు ఒకసారి వస్తుంది కనుక స్నేహితులతో కలిసి వేడుకలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. సీఎం సీటు వచ్చేలా ఉందని, ఎన్నికల వేళ బర్త్ డే పార్టీలో ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుంది కనుక తండ్రి వద్దని వారిస్తాడు. కొడుకు పట్టుబట్టడంతో సరేనని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. గోవాలోని ఫామ్ హౌస్‌లో పార్టీ మొదలవుతుంది. అనూహ్యంగా స్క్రీన్ మీద ఓ బొమ్మ వస్తుంది. అది చెప్పినట్టు చేయకపోతే ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని చంపేస్తుంది.
పుట్టినరోజు పార్టీ కోసం ఇంటిలోకి వెళ్ళిన వాళ్ళు బయటకు రాకుండా డోర్ దగ్గర భారీగా ఆర్‌డీఎక్స్ బాంబులు అమరుస్తారు. ఇంటిలో ఉండి చెప్పినది చేయకపోతే చావడం గ్యారెంటీ. ఏదోకటి చేసి ఆ ఇంటి నుంచి తన కొడుకును బయటకు తీసుకు రమ్మని పోలీస్ కమిషనర్ (శ్రీకాంత్ అయ్యంగార్)ను హోంశాఖ మంత్రి చెబుతాడు. సరిగ్గా ఆ సమయంలో డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఆ ఇంటిలో ఉన్నాడని తెలుస్తుంది. అక్కడ సంకల్ప్ ఏం చేశాడు? మనుషుల ప్రాణాలతో ఆటలు ఆడుతున్న వ్యక్తుల ఆట ఎలా కట్టించాడు? అనేది సినిమా.
విశ్లేషణ (Cult Review In Telugu): 'సార్... నాది నేను లేపుకుంటా! నన్ను ఎవరూ లేపక్కర్లేదు. మీరు స్ట్రెస్ తీసుకోకండి' - ఓ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ చెప్పిన ఈ మాట వైరల్ అయ్యింది. ఆయనపై విమర్శలు వచ్చాయి. ఆ మాటను మళ్ళీ 'కల్ట్'లో వాడారు. ట్రైలర్‌లోనూ ఆ మాట ఉంది. హీరో క్యారెక్టర్ తాలూకా యాటిట్యూడ్, డెప్త్ చెప్పడం కోసం ఆ మాట మళ్ళీ వాడినట్టు విశ్వక్ సేన్ చెప్పారు. దాంతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కడం ఖాయమని ప్రేక్షకులు భావించారు. ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా? అనేది చూస్తే...
'కల్ట్' ప్రచార చిత్రాల్లో కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' ఛాయలు కనిపించాయి. సినిమా చూశాక ఆ సిరీస్‌తో కంపేర్ చేయడం కష్టమే. 'ఫలక్‌నుమా దాస్'లో దర్శకుడిగా హైదరాబాదీ స్టైల్ చూపించడంలో విశ్వక్ సేన్ సక్సెస్ అయ్యారు. ఆ కథలో, దర్శకత్వంలో నేటివిటీ కనిపించింది. 'కల్ట్'కు వచ్చే సరికి ఆ నేటివిటీ మిస్ అయ్యింది. ముగ్గురు హైదరాబాదీ కుర్రాళ్లు గోవా వెళ్ళడం, అక్కడ బారులో ఎంట్రీ, అక్కడ నుంచి బర్త్ డే పార్టీ జరిగే ఇంటిలోకి వెళ్ళడం... ఓ సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం చకచకా వస్తాయి. అయితే ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకునేలా లేదు. సుమారు సినిమా ప్రారంభమైన గంట తర్వాత విశ్వక్ సేన్ ఎంట్రీ ఇస్తారు. ఆయన ఎంట్రీతో కాస్త ఆసక్తి మొదలైంది. కథలో అసలైన ఫేస్ ఆఫ్ మొదలు అవుతుందని అనిపిస్తుంది. అయితే... సెకండాఫ్ కూడా సేమ్ టు సేమ్ సీన్లు మళ్ళీ రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ బ్లాక్స్ రెండు బాగా రాశారంతే. అసలు ఎందుకు చంపుతున్నారు? చంపుతున్నది ఎవరు? అనే ట్విస్ట్ అసలు ఎగ్జైట్ చేయలేదు. దర్శకుడిగా విశ్వక్ సేన్ తన మార్క్ చూపిన సన్నివేశాలు ఒకట్రెండు తప్ప పెద్దగా కనిపించలేదు.
కథ, క్యారెక్టర్ల కంటే యాక్షన్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు విశ్వక్ సేన్. తెరపై రక్తం ఏరులై పారే విధంగా యాక్షన్ సీక్వెన్సులు తీస్తే ప్రేక్షకులు చూస్తారని భావించినట్టు ఉన్నారు. హోంశాఖ మంత్రి, ఆయన కుమారుడు పాత్రల నుంచి మొదలు పెడితే కమిషనర్, ఆఖరికి కథకు కీలకమైన ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ వరకు - ఎందులోనూ బలం లేదు. దాంతో రక్తసిక్తమైన సన్నివేశాలను భరించడం కష్టం అవుతుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో ఓకే. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్, ఎడిటింగ్ - కథకు తగ్గట్టు ఉన్నాయి.
Also Read: 418 Movie Review - 418 రివ్యూ: చైత్ర సినిమా భయపెట్టిందా? ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉందంటే?
దర్శకుడిగా కంటే కథానాయకుడిగా 'కల్ట్'కు ఎక్కువ న్యాయం చేశారు విశ్వక్ సేన్. ఆయన స్టైలింగ్, యాక్టింగ్ బావున్నాయి. తారక్ పొన్నప్పకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. అయితే నటుడిగా ఆయన చేసింది ఏమీ లేదు. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ రొటీన్ రోల్స్ చేశారు. గాయత్రీ భరద్వాజ్ పాత్రకు ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఉన్నంతలో కాస్త గ్లామర్ షో చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
Cult Movie Verdict: 'స్క్విడ్ గేమ్' తరహాలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ తీయాలని విశ్వక్ సేన్ చేసిన ప్రయత్నం ఆకట్టుకునేలా లేదు. ఆయన నటన, ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ బ్లాక్స్ పర్వాలేదు. అందుకోసం సినిమా చూడటం కష్టమే.
రేటింగ్: 1.75/5
Frequently Asked Questions
'కల్ట్' చిత్రానికి దర్శకత్వం వహించిన వారు ఎవరు?
'కల్ట్' సినిమా కథాంశం ఏమిటి?
గోవాలో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో ఒక బొమ్మ చెప్పినట్లు చేయకపోతే చంపుతామని బెదిరింపులు వస్తాయి. డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ.
'కల్ట్' సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?
'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది.
'కల్ట్' సినిమాపై విమర్శకుల అభిప్రాయం ఏమిటి?
'స్క్విడ్ గేమ్' తరహాలో తీయాలని చేసిన ప్రయత్నం ఆకట్టుకోలేకపోయింది. విశ్వక్ సేన్ నటన, ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ బ్లాక్స్ మాత్రమే పర్వాలేదు.
ట్రెండింగ్ వార్తలు






















