Manchu Vishnu Reaction On Names Controversy In Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే.. ఈ మూవీని బహిష్కరించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక పిలుపునివ్వడం వివాదానికి దారి తీసింది. మూవీలో బ్రాహ్మణులను అవహేళన చేసేలా రెండు పాత్రల పేర్లు ఉన్నాయంటూ వారు పేర్కొంటున్నారు. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించారు.
ప్లీజ్.. ఓపిక పట్టండి
మూవీలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు తమ మనోభావాలు దెబ్బతీశాయని.. ఆ పేర్లను తొలగించకుంటే.. రిలీజ్ అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. ఇటీవల గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆందోళన నిర్వహించారు. దీనిపై స్పందించిన మంచు విష్ణు.. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మూవీ రూపొందించామని చెప్పారు. ఆ పరమశివున్ని భక్తితో చూపించామని అన్నారు.
'ఈ మూవీలో సీన్స్ షూటింగ్ చేసే ముందు ప్రతీ రోజూ భక్తితో దేవున్ని పూజించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకునేవాళ్లం. స్క్రీప్ట్ దశలోనే వేదాధ్యయనం చేసిన వారితో పాటు, పలువురు ఆధ్యాత్మిక వేత్తల నుంచి సలహాలు స్వీకరించాం. భక్తితత్వాన్ని వ్యాప్తి చేయడమే 'కన్నప్ప' తీయడం వెనుక అసలు ఉద్దేశం. అంతే తప్ప ఎలాంటి వివాదాలు కాదు. మూవీ రిలీజ్ అయ్యే వరకూ ప్రతి ఒక్కరూ దయచేసి ఓపికతో ఉండండి. సినిమా విడుదల కాకముందే ఓ నిర్ణయానికి రావొద్దు.' అంటూ విష్ణు విజ్ఞప్తి చేశారు.
Also Read: త్రిశూలమా.. సుదర్శన చక్రమా? - బాలయ్య 'అఖండ' రుద్ర తాండవం.. వాట్ ఏ సిగ్నేచర్ మూమెంట్!
అసలేంటీ వివాదం?
'కన్నప్ప' మూవీలో పిలక, గిలక అనే క్యారెక్టర్ల పేర్లపైనే ఈ వివాదం మొదలైంది. పిలక రోల్‌లో కామెడీ కింగ్ బ్రహ్మానందం, గిలక రోల్‌లో సప్తగిరి నటించారు. వీరి ఫస్ట్ లుక్‌ను గతేడాది ఒకేసారి సోషల్ మీడియా వేదికగా మూవీ టీం రిలీజ్ చేసింది. 'చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గుగ్గుగురువులు.. అడవికి పాఠాలు చెప్పడానికి వస్తే..' అంటూ క్యాప్షన్ ఇచ్చి.. వీరిద్దరూ ఓ చెట్టు చాటున ఉన్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం.
అయితే.. పిలక, గిలక అనే పేర్లు తమ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించగా.. ఇప్పటికీ కేసు కోర్టు పరిధిలోనే ఉంది. ఈ పేర్లు, క్యారెక్టర్లతో తమ మనోభావాలు దెబ్బతీశారంటూ బ్రాహ్మణ సంఘాల చైతన్య వేదిక అసహనం వ్యక్తం చేస్తోంది. 'కన్నప్ప' మూవీని బహిష్కరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. అక్కడ కూడా ఆందోళన నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. తాజాగా ఈ అంశంపైనే విష్ణు క్లారిటీ ఇచ్చారు.
కన్నప్ప విషయానికొస్తే.. ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్స్, సాంగ్స్ మూవీపై భారీగా హైప్ క్రియేట్ చేశాయి.