డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'కన్నప్ప' (Kannappa Movie). ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్... అనేది ఉప శీర్షిక. ఓ నిజమైన భారతీయ కథ అని అర్థం. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు. హాలీవుడ్ స్థాయిలో 'భక్త కన్నప్ప'ను తీయాలని ఉందని కొన్నాళ్ళుగా విష్ణు మంచు చెబుతూ వస్తున్నారు. ఇవాళ ఆ సినిమాను ప్రారంభించారు.
శ్రీ కాళహస్తిలో పూజతో...
శ్రీ కాళహస్తిలో ఈ రోజు 'కన్నప్ప' సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అతి త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు. చాలా రోజులుగా ఈ కథ మీద విష్ణు మంచు పని చేస్తున్నారు. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు మంచు తండ్రి మోహన్ బాబు (Mohan Babu) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విష్ణు మంచు సరసన నుపుర్ సనన్!
'కన్నప్ప' సినిమాలో విష్ణు మంచు సరసన బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ (Nupur Sanon) నటించనున్నారు. తెలుగులో ఆమెకు రెండో చిత్రమిది. మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలోనూ ఆమె కథానాయిక. తెలుగులో మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', అక్కినేని నాగ చైతన్య 'దోచేయ్', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాల్లో నటించిన కృతి సనన్ చెల్లెలు ఈ నుపుర్. శ్రీ కాళహస్తిలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆమె కూడా పాల్గొన్నారు.
Also Read : 'ప్రేమ్ కుమార్' రివ్యూ : పీటల మీద పెళ్లి ఆగితే? ఈసారైనా సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?
'కన్నప్ప'కు స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ (Mahabharat) తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. భక్త కన్నప్ప, అతని భక్తి గురించి ఈ తరం ప్రేక్షకులకు సైతం తెలియజేసేలా సినిమాను తెరకెక్కిస్తామని విష్ణు మంచు తెలిపారు.
సింగల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేసేలా...
త్వరలో 'కన్నప్ప' చిత్రీకరణ ప్రారంభించి సింగల్ షెడ్యూల్‌లో సినిమా అంతా కంప్లీట్ చేస్తామని విష్ణు మంచు అన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయనున్నట్లు వివరించారు.
Also Read : మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: సొహెల్ ‘పురుష గర్భం’ ప్రయోగం ఎలా ఉంది? డెలివరీ హిట్టా? ఫట్టా?
'కన్నప్ప'కు రూ. 150 కోట్ల బడ్జెట్!
తెలుగులో 'భక్త కన్నప్ప' పేరుతో ఓ సినిమా వచ్చింది. దివంగత కథానాయకుడు కృష్ణంరాజు ఆ సినిమా చేశారు. ఆయనకు, మోహన్ బాబు కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉంది. సుమారు ఐదారేళ్ళ క్రితమే భక్త కన్నప్ప కథతో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు విష్ణు మంచు తెలిపారు. ఇప్పుడు పూజతో సినిమాకు శ్రీకారం చుట్టారు. హాలీవుడ్ స్థాయిలో రూపొందించనున్న 'కన్నప్ప' కోసం ఏకంగా రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల కంటే ఎక్కువ నిర్మాణ వ్యయం అవుతుందని భావిస్తున్నారట. దీంతో విష్ణు మంచు పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial