సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో.. ప్రస్తుతం 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో #VD12 మూవీ చేస్తున్నారు. దీంతో పాటుగా పరశురాం పెట్లా డైరెక్షన్ లో #VD13 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు బుధవారం (అక్టోబర్ 18) సాయంత్రం ఈ మూవీ టైటిల్ అండ్ గ్లింప్స్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
గతంలో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అందుకే ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న VD13 మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ అదే టైటిల్‌ను ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తూ.. గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. అంతేకాదు సినిమాను ఎప్పుడు విడుడల చేస్తారనే విషయాన్ని కూడా ప్రకటించారు.
'ఫ్యామిలీ స్టార్' టైటిల్ టీజర్ లోకి వెళ్తే, ''లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడం, టైంకి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించడాలు అనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే'' అంటూ విజయ్ దేవరకొండకు విలన్ అజయ్ ఘోష్ వార్నింగ్ ఇవ్వడంతో ప్రారంభమైంది. దీనికి కౌంటర్ గా ''భలే మాట్లాడతారన్నా మీరందరూ.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా?.. ఐరనే వంచాలా ఏంటి?'' అంటూ విజయ్ ఒక ఇనుప రాడ్ ని సింపుల్ గా వంచేయడమే కాదు, ఒకడి తల పగలకొట్టాడు. అంతేకాదు 'సారీ బాబాయ్.. కంగారులో కొబ్బరి కాయ తేవడం మర్చిపోయి, తలకాయ కొట్టేసాను' అంటూ తన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
'ఫ్యామిలీ స్టార్' టైటిల్ గ్లిమ్స్ ని బట్టి చూస్తే.. ఇందులో విజయ్ దేవరకొండ పాత్ర ఫ్యామిలీ మ్యాన్ గా చాలా సాఫ్ట్ గా ఉన్నప్పటికీ, తన జోలికి వస్తే మాత్రం తన బలాన్నంతా చూపించే వైల్డ్ మ్యాన్ గా మారుతాడని అర్థమవుతోంది. ప్రతి కుటుంబంలో ఒక హీరో ఉంటాడు అనే పాయింట్ ను చెప్పబోతున్నారని తెలుస్తోంది. 'గీత గోవిందం' తరహాలోనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా కావాల్సినంత మాస్, యాక్షన్ కూడా ఉంటుందని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
కుటుంబ విలువలు, భాధ్యతలు వంటి అంశాలతో పాటుగా యాక్షన్ కలబోసి దర్శకుడు పరశురామ్ ఈ కథ రాసుకున్నారని తెలుస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రం కావడంతో 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనిపిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, 'మజిలీ' బ్యూటీ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ టీజర్ చివర్లో 'ఏవండీ' అంటూ మృణాల్ ఎంట్రీ ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే చాలా ఈజ్ తో డైలాగ్స్ చెప్పి అలరించారు.
'ఫ్యామిలీ స్టార్' సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. ఇది SVC బ్యానర్ లో రాబోతున్న 54వ చిత్రం. దీనికి 'జోష్' డైరెక్టర్ వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా రిలీజైన వీడియోకి ఆయన కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
'ఫ్యామిలీ స్టార్' చిత్రాన్ని 2024 సంక్రాంతికి తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచే పొంగల్ కానుకగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో VD12 సినిమాని వెనక్కి తీసుకెళ్లి, VD13 మూవీకి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేస్తూ వచ్చారు. కంటెంట్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అనే ఫీలింగ్ కలుగుతోంది. మరి బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ తట్టుకొని విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial