కామెడీ చేయగలిగిన వాడు ఇంకా ఏదైనా చేయగలడు అని అంటుంటారు. ఇప్పటికే ఎంతోమంది కామెడియన్స్ ఆ మాటను నిజమే అని ప్రూవ్ చేశారు కూడా. కామెడియన్స్ నవ్వించినప్పుడు నవ్వే ప్రేక్షకులు.. వారి సీరియస్ పాత్రలకు కూడా అంతే కనెక్ట్ అవ్వగలరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ యంగ్ కామెడియన్స్ కొందరే ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు వెన్నెల కిషోర్. ఈయన ఒక పాత్ర చేస్తున్నాడంటే చాలు.. దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయడం మాత్రమే కాకుండా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, డైలాగులతో అందరినీ నవ్విస్తాడు కూడా. తాజాగా కిషోర్ హీరోగా ఎంట్రి ఇవ్వబోతున్నాడు.
కామెడియన్ నుంచి హీరోగా..
ఇప్పటివరకు వెన్నెల కిషోర్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ అన్ని సినిమాల్లోనూ కామెడీ పాత్రలే చేశాడు. మొదటిసారి కామెడియన్‌గా కాకుండా తానే హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతోంది. అదే ‘చారి 111’. సుమంత్‌తో కలిసి ‘మళ్లీ మొదలయ్యింది’ అనే చిత్రాన్ని చేసిన దర్శకుడు టీజీ కీర్తి కుమార్.. ‘చారి 111’కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ‘చారి 111’ అనే టైటిల్ చూస్తుంటేనే ఈ మూవీ ఒక స్పై థ్రిల్లర్ అని అర్థమవుతోంది. పైగా వెన్నెల కిషోర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు కాబట్టి కామెడీ చేసే స్పైగా హీరో క్యారెక్టరైజేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
అనౌన్స్‌మెంట్ వీడియో విడుదల..
‘చారి 111’లో వెన్నెల కిషోర్ ఒక సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. దానికోసం తన స్టైల్‌ను, యాటిట్యూడ్‌ను మార్చుకున్నాడు. అయితే వెన్నెల కిషోర్ పనిచేస్తున్న స్పై ఏజెన్సీకి హెడ్‌గా మురళీ శర్మ కనిపించనున్నారు. ఒక సిటీలో పలు మిస్టరీలు ఉంటాయని, వాటిని కనిపెట్టడానికి స్పై కిషోర్ రంగంలోకి దిగుతాడని ‘చారి 111’ అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక ఇందులో వెన్నెల కిషోర్‌కు జోడీగా సంయుక్త విశ్వనాథన్ నటించనుంది. బర్కథ్ స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్‌లో అదితి సోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘చారి 111’ అనౌన్స్‌మెంట్ వీడియోగా విడుదల చేసిన ఒక యానిమేషన్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ జోనర్‌లోనే..
వెన్నెల కిషోర్ హీరోగా చేస్తున్నాడు అనగానే ప్రేక్షకుల్లో ఆటోమేటిక్‌గా అంచనాలు పెరిగిపోతాయి. ఇక దీంతో పాటు అనౌన్స్‌మెంట్ వీడియో కూడా అందరినీ ఆకట్టుకోవడంతో ఈ మూవీ స్పై కామెడీ థ్రిల్లర్‌గా మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తుండగా.. ఇతర ముఖ్య పాత్రలో బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్ లాంటివారు నటిస్తున్నారు. సైమన్ కె కింగ్.. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాడు. తెలుగులో చివరిగా ఈ జోనర్‌లో నవీన్ పోలిశెట్టి నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా విడుదలయ్యింది. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఇలాంటి జోనర్‌లో మరెన్నో చిత్రాలకు స్కోప్ ఇచ్చినట్టుగా అయ్యింది. మరి వెన్నెల కిషోర్.. ‘చారి 111’ ద్వారా ఏ రేంజ్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తాడో చూడాలి.
Also Read: ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ - షారుఖ్ ‘జవాన్’ కోసం ఆ ఆరుగురు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial