Ananya Nagalla: డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు బాగా ఎక్కువైపోయాయి. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకొని రోజుకో కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారు. ఫేక్ కాల్స్ తో మభ్యపెట్టి ప్రజలను దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.. తగిన జాగ్రత్తలు చెబుతున్నారు. అయినా సరే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ, అందరూ ఏదొక సందర్భంలో సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. నెంబర్ బ్లాక్ చేస్తున్నామని ఫోన్ చేసి, పోలీసుల పేరు చెప్పి తన అకౌంట్ నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం చేశారని తెలిపింది.


అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. "మూడు రోజుల క్రితం కస్టమర్ కేర్ నంబర్ తో ఒక కాల్ వచ్చింది. ఒక అమ్మాయి మాట్లాడుతూ ఇంకో రెండు గంటల్లో మీ నంబర్ బ్లాక్ అవుతుందని చెప్పి, మరిన్ని వివరాల కోసం 9 ప్రెస్ చెయ్యమని చెప్పింది. 9 ప్రెస్ చేస్తే కస్టమర్ కేర్ పర్సన్ మాట్లాడుతూ.. నా ఆధార్ కార్డుతో ముంబై అందేరీలో ఒక సిమ్ తీసుకున్నారని, ఆ నంబర్ ద్వారా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని, మనీలాండరింగ్ జరుగుతోంది, అందుకే బ్లాక్ చేస్తున్నామని చెప్పాడు. ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి పోలీస్ క్లియరెన్స్ తీసుకోండి అని చెప్పాడు" అని తెలిపింది.


"పోలీసుల క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉంటే ఎప్పటికైనా మంచిందే కదా అని నేను ఓకే అన్నాను. దాంతో వాళ్లు మేం ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నామని, మేమే పోలీసులకు కనెక్ట్ చేస్తాం.. మీరు ఆన్ లైన్‌లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. వాళ్లు పోలీసులకు కనెక్ట్ చేయటంతో, నేను జరిగిందంతా చెప్పాను. ముంబై వచ్చి కంప్లైంట్ చేయమని అంటే, నేను హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పాను. దాంతో స్కైప్ ద్వారా వీడియో కాల్‌ చేసి కంప్లైంట్ చేయమని నాకో ఐడీ ఇచ్చారు"


"వీడియో కాల్‌లో పోలీస్ స్టేషన్ సెటప్ తో ఓ ఆఫీసర్ నాతో మాట్లాడారు. నా ఆధార్ నంబర్ తో ఏమేమి నంబర్స్ తీసుకున్నారో చెక్ చేయమని వాకీ టాకీలో ఇంకో పర్సన్ తో మాట్లాడారు. అతను షాకై నా పేరు మీద 25 నంబర్లు ఉన్నాయని, మనీలాండరింగ్ డ్రగ్స్ లావాదేవీలతో లింక్ అయ్యున్నాయని చెప్పారు. కొంతసేపటి తర్వాత కనెక్షన్ ప్రాబ్లం అని వీడియో ఆఫ్ చేసి, ఎంత కమీషన్ తీసుకున్నావ్? ఎందుకు తీసుకున్నావ్? చదువుకున్న అమ్మాయివి ఇలాంటివి ఎందుకు చేసావ్? నిన్ను జైల్లో వేస్తాం, ఏడేళ్ల శిక్ష పడుతుంది.. మీ ఫ్యామిలీకి ప్రమాదం ఉంది. ఇప్పుడే దీని గురించి మీ ఫ్యామిలీలో ఎవరికీ చెప్పకండి అని మాట్లాడారు. నాకు వాళ్ల మాటలు విని భయమేసింది.. ఏడుపు వచ్చింది"


"కొంతసేపటి తర్వాత మీకు సహాయం చేయటానికి మేం ఉన్నాం. కమిషన్ తీసుకోలేదని ఇంత గట్టిగా చెబుతున్నావ్ కాబట్టి, నీకు పోలీస్ క్లియరెన్స్ ఇప్పిస్తాం అంటూ మరో వ్యక్తిని కాల్‌ లోకి తీసుకున్నారు. వాళ్ళు నిజంగా పోలీసులు అని నన్ను నమ్మించడానికి నాకు కొన్ని డాక్యుమెంట్స్ పంపించారు. మీ అకౌంట్ నెంబర్లను చెక్ చేయాలి అని నన్ను భయపెడితే, రెండు అకౌంట్స్ ఉన్నాయని చెప్పాను. మీ అకౌంట్ ను ఆర్బీఐ వాళ్ళు వెరిఫై చేయడానికి కొంత అమౌంట్ ట్రాన్స్ ఫర్ చెయ్యమని నాకు ఒక థర్డ్ పార్టీ అకౌంట్ నెంబర్ పంపారు. అప్పుడే నాకు కొంచం డౌట్ వచ్చింది"


"ఆర్బీఐకి ట్రాన్సఫర్ చెయ్యాలి కదా, థర్డ్ పార్టీకి ఎందుకు? అని నేను ప్రశ్నిస్తే.. ఇదొక పెద్ద స్కామ్.. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. అందుకే ఇలా చేస్తున్నాం అని చెప్పారు. నాకు డౌట్ వచ్చి వెంటనే గూగుల్ చేశాను. ఇది ఫ్రాడ్ అని, ఇలాంటివి చాలా జరుగుతున్నాయని తెలుసుకున్నాను. నేను వాళ్ళ మీద గట్టిగా అరిచాను. నువ్వు కమిషన్ తీసుకున్నావ్ కాబట్టే ఇలా చేస్తున్నావ్ అంటూ వాళ్ళు నాకంటే గట్టిగా అరిచారు. నేను పోలీసులకు కంప్లైంట్ చేయటానికి వెళ్తున్నా అనే సరికి వాళ్లు ఫోన్ కట్ చేసేశారు" అని అనన్య వీడియోలో చెప్పుకొచ్చింది. ఇలాంటి స్కాములు చాలా జరుగుతున్నాయని, వాళ్ళకున్న నెట్ వర్క్ ను మనం ఊహించలేమని, ఎవరైనా మనీ అడుగున్నారంటే అది సైబర్ క్రైమ్ అని, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని అనన్య నాగళ్ల హెచ్చరించింది.






Also Read: ధనుష్ బాడీగార్డ్ ఓవరాక్షన్ - ముంబై బీచ్‌లో అభిమానుల పట్ల దురుసు ప్రవర్తన