Upasana Konidela About Her Life Experiences: తన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు అధిగమించి స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తెలిపారు. ఎంచుకున్న రంగంలో తన కృషి వల్లే ఈ గుర్తింపు దక్కిందని... పెళ్లి వల్లో వారసత్వం వల్లో తనకు ఈ గుర్తింపు దక్కలేదని చెప్పారు. 'ది ఖాస్ ఆద్మీ' పార్టీ పేరిట తన అభిప్రాయాలను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 

ఎవరికి వారే ఆన్సర్ వెతుక్కోవాలి

ఓ వ్యక్తిని మనీ, హోదా, సక్సెస్ వంటివి గొప్పగా చూపిస్తాయా? లేదా స్పందించే గుణం, ఇతరులకు సాయం చేయడం వంటివి గొప్ప వారిని చేస్తాయా? అనే వాటికి ఎవరికి వారే ఆన్సర్ వెతుక్కోవాలంటూ ఉపాసన చెప్పారు. 'ఇలాంటి అంశాలకు ఎక్కడా సమాధానం ఉండదు. మనలో మనమే వెతుక్కోవాలి. నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు ప్రేమించి నీకంటూ విలువ ఇచ్చుకోవడం అన్నిటికంటే ముఖ్యం. అది మనల్ని ఓ ప్రత్యేక వ్యక్తులుగా నిలబెడుతుందని భావిస్తున్నా. వృత్తిపరమైన విజయాలనే సమాజం గుర్తిస్తుంది.' అంటూ తెలిపారు.

Also Read: సునీల్ కీలక రోల్... బాహుబలి ఏనుగు స్పెషల్ అట్రాక్షన్ - 'మార్కో' ప్రొడ్యూసర్స్ కొత్త మూవీ 'కాటాలన్' ప్రారంభం

సొసైటీ నుంచి ప్రోత్సాహం ఉండదు

సొసైటీ నుంచి ఆడవారికి ఎప్పుడూ సరైన ప్రోత్సాహం ఉండదని... మహిళలు పెద్ద కలలు కనేందుకు ఇచ్చే ప్రోత్సాహం చాలా తక్కువని అభిప్రాయపడ్డారు ఉపాసన. 'సమాజం ఎప్పుడూ కూడా మహిళలను వినయంతో మసులుకోమనే చెప్తుంది. ఏదైనా సరే మన వంతు వచ్చే వరకూ ఆగమని చెప్తుంది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం... 50 శాతం మంది భారతీయులు తాము అనుకున్న స్థాయికిి రీచ్ కాలేకపోతున్నారు. దాదాపు 16 శాతం మంది మహిళలు డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మితే సక్సెస్ దానంతట అదే వస్తుంది.' అంటూ చెప్పారు.

ఒత్తిళ్లు అధిగమించా...

జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు అధిగమించి తాను ఈ స్థాయికి చేరినట్లు ఉపాసన తెలిపారు. 'నేను ఈ స్థాయిలో ఉండడానికి నా కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం కారణం కాదు. అలాగే రామ్ చరణ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ నిలబడలేదు. ఎలాగైనా సరే జీవితంలో ఎదగాలని తాపత్రయపడ్డాను. నా పనిపై నాకే కొన్నిసార్లు సందేహం కలిగేది. అప్పుడూ చాలా నిరుత్సాహపడ్డాను. అయితే, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ఆ పనిని మొదలు పెట్టి విజయం సాధించాను. అసలైన బలం ఆత్మగౌరవంలోనే ఉంది. దీనికి డబ్బుకు, హోదా, కీర్తికి సంబంధం లేదు. అహంకారం గుర్తింపును కోరితే... ఆత్మగౌరవం నిశ్శబ్దంగా గుర్తింపును సృష్టిస్తుంది.' అని ఉపాసన రాసుకొచ్చారు. ఒక్క సెకనులో వచ్చే ఆలోచనతోనే మార్పు మొదలవుతుందని... తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అభిప్రాయాలు పంచుకున్నానే తప్ప ఓ నిపుణురాలిగా కాదని స్పష్టం చేశారు.