Unstoppable S4 Promo with CBN: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రేక్షకుల అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభం అవుతోంది. ఈ నెల 25న ఈ ఎపిసోడ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజా తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ షోలో చంద్రబాబు రాజకీయాలు మొదలుకొని ఇంటి విషయాల వరకు చాలా విషయాలు వెల్లడించారు. ఎప్పుడూ సీరియస్ గా ఉండే చంద్రబాబుతో బాలయ్య ఫన్నీ గేమ్స్ ఆడించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.


అదిరిపోయే ఇంట్రోతో చంద్రబాబు ఎంట్రీ


“అభిమానులు, బాలయ్య వేరుకాదు, అభిమానులు, బాలయ్య ఒక్కటే. పండగ మళ్లీ మొదలయ్యింది. ఇది బాలయ్య పండుగ” అంటూ ప్రోమో ప్రారంభం అయ్యింది. పోలీస్, డాక్టర్, సహా పలు గెటప్ లలో బాలయ్య కనిపించారు. “దేశ రాజకీయాల్లో చెరగని విజయాన్ని అందుకున్న చాణక్యుడు, మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మా బావగారు, మీ బాబు గారు.. నారా చంద్రాబు నాయుడు గారు” అంటూ సాదరంగా స్టేజి మీదికి ఆహ్వానించారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించి షో మొదలు పెట్టారు. “మీ చమత్కారం మీది, మా సమయ స్పూర్తి మాది” అంటూ చంద్రబాబు నవ్వించారు.


జైల్లో 53 రోజులు.. చావు గురించి ఆలోచించా!


ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కక్ష రాజకీయాల గురించి బాలయ్య అడిగిన ప్రశ్నతో షో మొదలయ్యింది. జగన్ సర్కారు చంద్రబాబును అరెస్టు చేయడం గురించి తొలి ప్రశ్న వేశారు. అరెస్టు విషయం మీకు ముందే తెలుసా? అని అడిగారు. “నేను బస్సులో ఉన్నాను. నేరుగా వచ్చి మిమ్మల్ని అరెస్టు చేశాం అని చెప్పారు. రాత్రంతా లోపలే ఉంచారు. తలుపు కొట్టినా తీయలేదు. జైల్లో చాలా బాధాకరమైన క్షణాలు గడిపాను. చావు గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది.  53 రోజులు జైల్లో అదే జరిగింది. నేను తప్పు చేయను. చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు” అని చంద్రబాబు చెప్పారు.   


పవన్ కల్యాణ్ తో కలిసి చారిత్రక నిర్ణయం తీసుసుకున్నా!


ఆకాశంలో సూర్య చంద్రులు, ఆంధ్రాలో బాబు, కల్యాణ్ బాబు అంటున్నారు. తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు. తొలిసారి మీ మీటింగ్ జైలులో ఎలా జరిగింది? ఏం జరిగింది.? అని బాలయ్య మరో ప్రశ్న వేశారు. “పవన్ కల్యాణ్ నన్ను జైల్లో కలిశారు. తను, నేను నేను రెండు నిమిషాలు మాట్లాడాం. నూతన రాజకీయ చరిత్రను రాయడానికి సమయ స్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నాం. ఆదో చారిత్రాత్మక నిర్ణయం” అని చెప్పారు.



ఫన్నీ ప్రశ్నలు.. చలాకీ సమాధానాలు


ఆ తర్వాత వైజాగ్, విజయవాడ అనే ఫోటోలను చూపించి, “మీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి?” అని బాలయ్య అడగగా, “నాకు నచ్చిన ప్రదేశం పెట్టలేదు” అంటూ అమరావతి గురించి ప్రస్తావించారు చంద్రబాబు. ఇక “మా చెల్లితో కలిసి చూసిన రొమాంటిక్ సినిమా ఏది?” అని అడగ్గా,  “నువ్ మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చాలా సమస్యలు వస్తాయి” అంటూ నవ్వారు.  “ఇంట్లో పెత్తనం మా చెల్లిదా? నా కూతురిదా?” అని అడగడంతో.. “ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయంటూ” నవ్వారు.  క్రికెటర్లలో ధోనీ, కోహ్లీలో తనకు కోహ్లీ నచ్చుతాడని చెప్పారు. ఆ తర్వాత ఫన్నీ గేమ్స్ తో ఆకట్టుకున్నారు. “నేను మాస్ హీరో అయితే, మీరు మాస్ లీడర్” అని బాలయ్య అనగానే.. “బోత్ ఆర్ నాట్ సేమ్” అంటూ చంద్రబాబు చెప్పిన డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.






ఈ నెల 25న తొలి ఎపిసోడ్  స్ట్రీమింగ్


అన్ స్టాఫబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ ఈ నెల 25 రాత్రి 8.30 గంటలకు ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. చంద్రబాబు నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా గెస్టుగా వచ్చారు.


Read Also: 'కంగువా' ఫస్ట్ హాఫ్​పై ప్రొడ్యూసర్ క్రేజీ కామెంట్స్, ‘బాహుబలి’ రికార్డులు బద్దలవుతాయా?