Lucky Bhaskar Telugu Review : 'మహానటి, సీతారామం' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలతో వైవిధ్యభరితమైన పాత్రలు చేసి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఆయనకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీపావళికి 'లక్కీ భాస్కర్' అనే సినిమాతో దుల్కర్ సల్మాన్ ప్రేక్షకులను అల్లరించడానికి రెడీ అవుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 31న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ టాక్ ఎలా ఉందనే విషయం బయటకు వచ్చింది.


అక్టోబర్ 27న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాదులోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 'లక్కీ భాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడుతూ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ 'కొత్తతరం నటుల్లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇద్దరూ గొప్ప నటులు' అంటూ యంగ్ స్టార్స్ ఇద్దరిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆయన సినిమా గురించి మాట్లాడుతూ 'సాధారణంగా మనం సినిమాలను చూసేటప్పుడు అందులో ఉన్న హీరో గెలవాలని కోరుకుంటాము. ఈ సినిమా చూసినప్పుడు నాకు మాత్రం డిఫరెంట్ గా అనిపించింది.


భాస్కర్ లక్కీ అవ్వాలని సినిమా చూస్తున్నంత సేపు హీరో గెలవాలని కోరుకుంటూనే ఉన్నాను. ఫైనల్ గా అతను లక్కీగానే బయటకు రావడం సంతోషంగా అనిపించింది. ఈ మూవీకి లక్కీ భాస్కర్ అనే టైటిల్ కరెక్టుగా యాప్ట్ అయ్యింది. సినిమాలోని చిన్న చిన్న పాత్రలను కూడా డైరెక్టర్ వెంకీ తీర్చిదిద్దుతున్న విధానం ఆకట్టుకుంటుంది. కథని ఎఫెక్ట్ చేయకుండా సినిమాలో ఒక్క పాత్ర కూడా ఉండదు. బ్యాంక్ లో బయట నిలబడే సెక్యూరిటీ తో సహా సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఎమోషన్ తో కట్టిపడేస్తారు. సల్మాన్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆయన ఈజ్ తో అద్భుతంగా నటించాడు. అతన్ని చూస్తుంటే నిజంగా ఒక బ్యాంక్ లోకి వెళ్లిపోయి క్లర్క్ జీవితంలో ఎంటర్ అయినట్టుగా అనిపిస్తుంది. మనల్ని కూడా చెయ్యి పట్టుకుని తనతో పాటు ఆ బ్యాంకులోకి తీసుకెళ్లిపోతాడు దుల్కర్' అంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 


"అతనిలో ఉన్న నటుడు మామూలోడు కాదు. తాను చేసిన ప్రయత్నం మనకు కనిపించకుండా ఉండడానికి చేసిన ప్రయత్నానికి హాట్సాఫ్ చెప్పాలి. మమ్ముట్టి ఇలాంటి మర్రి చెట్టుకు పుట్టిన ఆయన ఆ చెట్టు కింద మొక్కలు బ్రతకవనే ఆలోచనను మార్చేసి, దాన్నుంచి బయటకు వచ్చి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తన రోడ్డు తాను వేసుకోవడం మాత్రమే కాకుండా మమ్ముట్టి లాంటి గొప్ప నటుడు తన వారసుడిని చూసి గర్వపడే రేంజ్ కి ఎదిగారు. సినిమాలోని ప్రతి పాత్ర నా మనసుకు బాగా దగ్గరయింది. ఈ సినిమాలో అందరి కంటే ఎక్కువగా నేను ఫిదా అయింది రాంకి గారి పాత్రకు. సినిమా కంప్లీట్ గా చూశాక నాకు వచ్చిన ఫీలింగ్ ఒకటే.. ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక అడ్వెంచర్ చేస్తే కచ్చితంగా నెగ్గాలని కోరుకుంటాము. ఎందుకంటే చాలామంది అక్కడ నుంచి వచ్చారు.


అడ్వెంచర్ చేసినా సరే దాన్నుంచి సక్సెస్ ఫుల్ గా బయట పడతాము అనేది మనకు ఉండే ఒక హోప్. సినిమాను చూశాక కచ్చితంగా ప్రేక్షకులు తడిసిన కళ్ళతో నవ్వుతున్న ముఖాలతో థియేటర్ బయటకు వస్తారు. ఈ సినిమా వెంకీకి, సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని నేను నమ్మడమే కాదు.. ఆ దేవుడిని ప్రార్థిస్తూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను " అంటూ సినిమాపై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు త్రివిక్రమ్. అలాగే మలయాళ సినిమాతో పాటే విజయ్ దేవరకొండపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. 


 


Also Readనాగార్జున కంటే ఎన్టీఆర్, నాని బెటర్ - ముందు ఆయన్ను మార్చేయాలి... స్పై అక్క సీరియస్