టాలీవుడ్ లో ఇప్పుడంటే తెలుగమ్మాయిలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఇండస్ట్రీలో మన హీరోయిన్లదే హవా కొనసాగేది. అలాంటి వారిలో సీనియర్ నటి మాధవి ఒకరు. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన మాధవి.. సినిమాల నుంచి దూరమైన తర్వాత ఎక్కడా కనిపించలేదు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అలనాటి నటీమణి తాజాగా వార్తల్లో నిలిచింది.

 

ఆంధ్రప్రదేశ్‌ లోని ఏలూరులో పుట్టి పెరిగిన మాధవి అసలు పేరు కనక మహాలక్ష్మీ. చిన్నప్పటినుంచే భరతనాట్యం పట్ల ఆసక్తి ఉన్న మాధవి.. తన 8వ ఏట నుండే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించి.. 300లకు పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్‌ చేసింది. ఈ క్రమంలో 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన నటి.. 'ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య' చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైంది.

 

మెగాస్టార్ చిరంజీవి, విశ్వ నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి సూపర్ సీనియర్ హీరోలకు జోడిగా నటించి మెప్పించింది మాధవి. దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె.. 300కి పైగా సినిమాలలో నటించింది. ఆమె కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం 'మాతృదేవోభవ' అని చెప్పాలి. అయితే 1996 తర్వాత మాధవి వెండి తెరపై కనిపించలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమె గురించి తెలుసుకునే అవకాశం కలిగింది.

 

మాధవి ఇన్స్టాగ్రామ్ లో ఉందని ఇటీవలే తెలుగు ఆడియెన్స్ దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె.. తరచుగా తన భర్త, పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. అయితే ఇందులో మాధవిని టక్కున గుర్తు పట్టడం ఎవరికైనా కష్టమే. ఎందుకంటే ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. 



 

అభినయంలో జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్స్ కి పోటీనిచ్చిన మాధవి.. ఇప్పుడు అలా ఉండటం చూసి తెలుగు సినీ అభిమానులు షాక్ అవుతున్నారు. ఒకప్పుడు తన తేనె కళ్లలతో మాయ చేసిన నటి.. ఇంతలా మారిపోయారేంటంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మాధవి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

మాధవి ప్రస్తుతం విదేశాలలో నివసిస్తున్నారు. 1996లో బిజినెస్‌మెన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చిత్ర పరిశ్రమకు దూరమైంది. తన భర్తతో పాటుగా అమెరికా వెళ్లి సెటిలైపోయింది. వివాహం అనంతరం తన జీవితాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయించటం.. అక్కడే బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండటం వల్లనే మళ్ళీ సినిమాల్లోకి రాలేదనే టాక్ వుంది. 

 



అలనాటి హీరోయిన్లందరూ ప్రస్తుతం సెకండ ఇన్నింగ్స్ ప్రారంభించి, క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. కానీ మాధవి మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. మాధవికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె కుమార్తెల ఫోటోలను చూసిన నెటిజన్లు.. ఒక్కరినైనా ఇండస్ట్రీకి తీసుకొస్తే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సీనియర్ నటి ఆ దిశగా ఆలోచన చేస్తుందేమో చూడాలి.