Tollywood Senior Actor Giribabu Passed Away : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ తెలుగు నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
2023లో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' ఆయనకు చివరి చిత్రం. దాదాపు 600కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. గిరిబాబు సతీమణి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు రఘుబాబు, బోసుబాబు ఇద్దరు కుమారులు కాగా... రఘుబాబు హాస్యనటుడు.
సినీ ప్రయాణం
గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరి రావు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా కొరిశపాడు రావినూతల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో నాటకాల్లో నటించేవారు. సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్లారు. 1973లో 'జగమే మాయ' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా ఇలా విభిన్న పాత్రలతో నటనలో తనదైన ముద్ర వేశారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ పని చేశారు.
'రణరంగం', 'నీ సుఖమే నే కోరుకున్నా', 'ఇంద్రజిత్' సినిమాలకు దర్శకత్వం వహించిన గిరిబాబు.... 'సింహ గర్జన', 'ఇంద్రజిత్', 'మెరుపుదాడి' చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రారంభంలో విలన్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన... ఆ తర్వాత కమెడియన్ పాత్రలు, కుటుంబ కథా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి సూపర్ ఫేమ్ సంపాదించుకున్నారు. కరుణామయుడు, కురుక్షేత్రం వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకం.
లేటెస్ట్ మూవీస్‌లోనూ...
రీసెంట్ మూవీస్‌లోనూ గిరిబాబు కీలకపాత్రలు చేశారు. నువ్వేకావాలి, అల్లరి నరేష్ 'కితకితలు'లో తనదైన కామెడీతో నవ్వించారు. రవితేజ 'ఇడియట్', 'గమ్యం', 'బాద్‌షా', 'గోవిందుడు అందరివాడేలే', ఎవడైతే నాకేంటి, బిందాస్, మహేశ్ బాబు అతడు, గీత గోవిందం, జాతిరత్నాలు, అ ఆ వంటి సినిమాల్లో కీలకపాత్రలతో అలరించారు. అలాగే, 90s హిట్ మూవీస్‌లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. తన కెరీర్‌లో ఏకంగా 600కు పైగా సినిమాల్లో నటించారు.
Also Read : Manchu Manoj Reaction : ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం - చేయాల్సింది చాలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్
