టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకమైన క్రేజ్ ఉందనడంలో సందేహం లేదు. 'తాతమ్మ కల' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సినీ పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే ఈ వేడుక వివరాలను వెల్లడిస్తూ నేడు (బుధవారం) ఎఫ్‌ఎన్‌సీసీలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి సోదరుల చేతుల మీదుగా స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను లాంచ్ చేశారు.


ఈ సందర్భంగా సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో 50 ఏళ్లు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే. ఆయనతో 13 సినిమాలు చేశానంటే బాలయ్యది ఎంత మంచి వ్యక్తిత్వమో అర్థమవుతుంది. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు. ఆయన ఈ  ప్రస్థానంలో నేను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ మధ్య ఎక్కడికెళ్లినా జై బాలయ్య అని అంటున్నారు. యూత్ నాడి పట్టుకున్న నటుడు బాలకృష్ణ. రామారావుగారి వారసుడిగా సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు" అంటూ కోదండరామిరెడ్డి బాలయ్యను కొనియాడారు. 


దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. "బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్రహీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే ఇన్ని ఏళ్లు నటుడిగా రాణించారు. బాలయ్య చాలా సింప్లిసిటీగా ఉంటారు. మేమిద్దరం ఒకసారి గోవా వెళ్లినప్పుడు ఒక ట్రే వాటర్ బాటిల్స్ కొని ఆయనే మోసుకొచ్చారు. ఆయన అంత సింపుల్‌గా ఉంటారు. బాలయ్య నిర్మాతల మనిషి. నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి" ఆయన పిలుపునిచ్చారు. 


నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "నందమూరి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలున్నాయి. మా సోదరుడు కైకాల సత్యనారాయణను రామారావుగారు సొంత తమ్ముడిలా చూసుకునేవారు. నిర్మాతలకు గౌరవం ఇవ్వడంలో అన్నగారి తర్వాత ఆయన వారసుడు బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని బాలయ్య నమ్ముతారు. అలాంటి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి" అని ఆయన అన్నారు.


నటుడు మాదాలరవి మాట్లాడుతూ... "నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా భాగస్వాయ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. మా అసోసియేషన్‌లో గర్వించదగ్గ హీరో బాలకృష్ణ గారు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేయడమే కాకుండా రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ కొట్టి సేవ చేస్తున్నారు. అలాగే క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా కూడా సేవ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన గొప్ప హీరో బాలకృష్ణ గారికి గోల్డెన్ జూబ్లీ చేయడం ఎంతో గొప్ప విషయం" అన్నారు. 


సీనియర్ నిర్మాత సీ కల్యాణ్ మాట్లాడుతూ.. "మా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతోందంటే నాకు భయంగా ఉంది. ఆయన సినిమాలు, ఆయన కలెక్షన్స్ అన్నీ రికార్డులకెక్కాయి. ఈ ఫంక్షన్ ఆ రికార్డులన్నింటినీ దాటి ఇంకా గొప్పగా జరగాలనేది నా తాపత్రయం. తప్పకుండా గొప్పగా చేస్తాం. ఇంతకు ముందు ఏ ఫంక్షన్ ఎలా జరిగినా.. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అందరూ తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తున్నా. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గొప్ప ఈవెంట్‌గా బాలయ్య గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల నటులు పాల్గొంటారు" అని చెప్పారు. 


దర్శక-నిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. "1974 మేలో గుడివాడలో తాతమ్మ కల సినిమా చూశా. అక్కడి నుంచి 50 ఏళ్లు మా కళ్ల ముందు గిర్రున తిరిగి ఇంత దూరం వచ్చేశామా అనేది ఒక కలలా అనిపిస్తోంది. అప్పుడు నేనొక లారీ డ్రైవర్ కొడుకుని. రామారావుగారి అభిమానిని. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఇలా మీ ముందు మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. నందమూరి బాలకృష్ణ గారికి తల్లిదండ్రులతో పాటు గురువు కూడా ఇంట్లోనే ఉన్నారు. అది ఆయన అదృష్టం. ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆయన 50 ఏళ్ల వేడుక అందరికీ స్ఫూర్తిదాయంకంగా ఉండేలా జరగాలని కోరుకుంటున్నా" అని అన్నారు.



తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. "హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ హ్యాట్రిక్ హీరోగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సేవలందరిస్తూ ఉన్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. భవిష్యత్తులో ఎవరూ సాధించలేని రికార్డును సృష్టించిన హీరో బాలకృష్ణ. నాలుగు తరాలపాటు రాముడిగా, కృష్ణుడిగా చేసింది ఒక్క నందమూరి కుటుంబమే. అలాంటి బాలయ్య 50 ఏళ్ల వేడుకకు అందరూ హాజరు కావాలి. ఈ వేడుకకు బాలయ్య ముందు ఒప్పుకోలేదు. కానీ ఇదొక స్ఫూర్తిదాయ కార్య్రక్రమంగా ఉంటుందని చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనేలా చేస్తాం" అన్నారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ మాట్లాడుతూ.. "సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుతున్నా" అని అన్నారు.


Also Read: గేమ్‌ ఛేంజర్‌ టైం స్టార్ట్‌ అయ్యింది - డబ్బింగ్‌ వర్క్‌ మొదలెట్టిన మూవీ టీం, ఇక ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్‌ జాతరే...