Sudheer Babu On Arshad Warsi's Comment: బాలీవుడ్ సీనియర్ నటుడు అర్షద్ వార్సీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన కామెంట్స్ ను టాలీవుడ్ తో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అర్షద్ వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు.


ఇప్పటికే పలువురు తెలుగు సినీ ప్రముఖులు అర్షద్ వ్యాఖ్యలపై నిప్పులు చెరగగా, తాజాగా యంగ్ హీరో సుధీర్ బాబు ఆయన కామెంట్స్ ను తప్పుబట్టారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అయిన అర్షద్ నుంచి తాను ఇలాంటి వ్యాఖ్యలను ఊహించలేదని వెల్లడించారు. “నిర్మాణాత్మకంగా విమర్శలు చేసినా ఫర్వాలేదు. నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. వార్సీలో వృత్తి నైపుణ్యం లోపించిందని స్పష్టంగా అర్థం అవుతోంది. ఆయన నుంచి ఇలాంటి కామెంట్స్ నేను అస్సలు ఊహించలేదు. ప్రభాస్ స్థాయి చాలా పెద్దది. ఆయన ఈ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






ఇంతకీ అర్షద్ వార్సీ ఏమన్నారంటే?


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్షద్ వార్సీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గురించి స్పందించారు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర జోకర్ లా ఉందన్నారు. మేకర్స్ ఆయనను ఎందుకు అలా చూపించారో అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా నటించారని ప్రశంసించారు. అర్షద్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఆయన అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వెంటనే అర్షద్ ప్రభాస్ కు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అర్షద్ వ్యాఖ్యలపై ఇప్పటికే నిర్మాతలు కేఎస్, అభిషేక్ అగర్వాల్ సైతం స్పందించారు. ఎంతో మంది ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ప్రభాస్ ను జోకర్ గా అభివర్ణించడంపై అసహనం వ్యక్తం చేశారు. “సినిమాను విమర్శించడంలో తప్పులేదు. కానీ, ప్రభాస్ ను జోకర్ అనడం సమంజసంగా లేదు. అర్షద్ వ్యాఖ్యలు అనాలోచితంగా ఉన్నాయి అనిపిస్తోంది” అని కామెంట్స్ చేశారు.


బాక్సాఫీస్ దగ్గర రూ. 1200 కోట్లు వసూళు


ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 1200 కోట్లకుపైగా వసూళు చేసి సత్తా చాటింది. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్ యాక్టర్లు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.



Read Also: దర్శకుడి పబ్లిసిటీ పిచ్చి... కటౌట్లు, కోరికలు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయా?