టైగర్ అంటే సల్మాన్ ఖాన్! సల్మాన్ ఖాన్ అంటే టైగర్! 'టైగర్' టైటిల్ మీద పేటెంట్ రైట్స్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) దగ్గర ఉన్నాయని చెప్పాలి. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాలతో బాక్సాఫీస్ బరిలో ఆయన భారీ విజయాలు నమోదు చేశారు. మంచి వసూళ్లు సాధించారు. స్పై ఫిలిమ్స్ అంటే భారతీయ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. 


సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ స్పై ఫిల్మ్ 'టైగర్ 3' (Tiger 3 Movie). ఇందులో కట్రీనా కైఫ్ (Katrina Kaif) కథానాయిక. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' తర్వాత ఆ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో హిందీ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న తాజా  చిత్రమిది. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు 'టైగర్ సందేశం' (Tiger Ka Message) పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. 


ఇండియాను సర్టిఫికేట్ అడుగుతున్న టైగర్!
''నా అసలు పేరు అవినాష్ సింగ్ రాథోడ్! మీ అందరికీ నేను 'టైగర్'ని. 20 ఏళ్లుగా నా జీవితాన్ని ఇండియా సంరక్షణ కోసం వెచ్చించాను. దానికి బదులు నేను ఏమీ అడగలేదు. కానీ, ఇప్పుడు అడుగుతున్నాను. ఇవాళ మీ అందరికీ టైగర్ మీ శత్రువు అని చెబుతున్నారు. టైగర్ దేశ ద్రోహి అని! టైగర్ మన శత్రువుల్లో నంబర్ వన్ అని. దేశానికి 20 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఇండియాను నా క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతున్నాను. నా కొడుకుకు నేను కాదు, ఇండియా చెబుతుంది... తన తండ్రి  ఎవరు? అని! దేశ ద్రోహా? దేశ భక్తుడా? అని! బతికి ఉంటే మీకు సేవ చేయడానికి నేను మళ్ళీ వస్తాను. లేదంటే జైహింద్!'' అని 'టైగర్ 3'  సందేశంలో సల్మాన్ ఖాన్ చెప్పారు.


Also Read హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?  


ఇండియాలోని న్యూస్ ఛానళ్లలో టైగర్ దేశ ద్రోహి అని, ఇండియాకు శత్రువు అని ఎందుకు చెబుతున్నారు? టైగర్ మీద ఆర్మీ ఎందుకు ఎటాక్ చేసింది? అసలు ఏమైంది? అనేది సినిమా కథగా తెలుస్తోంది. 


టైగర్ 3... లాస్ట్ పంచ్ అదిరిందిగా!
యాక్షన్ ఫిలిమ్స్ అంటే హై స్టాండర్డ్స్ సెట్ చేసిన ఇండియన్ సినిమాల్లో 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాలు ఉంటాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ 'టైగర్ 3' ఉంటుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. 'టైగర్ 3' సందేశం పేరుతో విడుదల చేసిన వీడియో గ్లింప్స్ ఒక ఎత్తు... చివరలో సల్మాన్ ఖాన్ చెప్పిన డైలాగ్ మరో ఎత్తు. అది నెక్స్ట్ లెవల్!


''టైగర్ జీవించి ఉన్నంత వరకు ఓటమి ఒప్పుకోడు'' అని సల్మాన్ ఖాన్ ఇచ్చిన లాస్ట్ పంచ్ అదిరింది.



'టైగర్ 3' చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. ఆదిత్య చోప్రా కథ అందించడంతో పాటు యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవ, ఛాయాగ్రహణం : అనయ్ ఓం గోస్వామి, సంగీతం : ప్రీతమ్.      


Also Read  నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial