Crime Suspense Thriller The Dark Heaven Telugu OTT Streaming: తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. సస్పెన్స్, ట్విస్టులతో సాగే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. తాజాగా మరో తమిళ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అయ్యింది. ఆసక్తికరమైన కథ, సస్పెన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది.
ఓ ఊరిలో జరిగే వింత మరణాల చుట్టూ సాగే సస్పెన్స్ స్టోరీ 'ది డార్క్ హెవెన్' (The Dark Heaven). సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, సింప్లీ సౌత్ ప్లాట్‌ఫామ్స్‌లో తమిళ వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బుధవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాలో సిద్ధు సిద్, దర్శిక, రిత్విక, వేలరామమూర్తి, నిళల్గల్ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలాజీ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. శక్తి బాలాజీ సంగీతాన్ని అందించారు. కోతై ఎంటర్టైన్మెంట్(Kothai Entertainment), ఎంఎస్ స్విస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ(MS Swiss Film Factory) నిర్మాణ సంస్థలపై బూపతి కలైవాణన్ (Boopathy Kalaivanan) ఈ సినిమాను నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?1970ల్లో ఓ ఫ్రెంచ్ పరిశోధకుడు రాసిన సీక్రెట్ బుక్ ఆధారంగా ఓ ప్రాచీన శాపం చుట్టూ మారుమూల కొండ ప్రాంతమైన 'మేక్కరై' (Mekkarai) అనే ఊరిలో 'ది డార్క్ హెవెన్' స్టోరీ సాగుతుంది. దశాబ్దాలుగా ఆ ఊరిలో ఓ మూఢనమ్మకం ప్రచారంలో ఉంటుంది. ప్రతీ ఏడేళ్లకోసారి ఆ గ్రామంలో సరిగ్గా జూన్ నెలలో మగాళ్లు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. గ్రామానికి ఏదో శాపం ఉందని... అందుకే ఈ వింత మరణాలు సంభవిస్తున్నాయని నమ్ముతుంటారు.
ఇదే టైంలో ఊరికి కొత్త ఎస్సై ఇళంపాగ్రి (సిద్ధూ) వస్తాడు. ఈ అనుమానాస్పద మరణాల వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు తన టీంతో కలిసి రంగంలోకి దిగుతాడు. అసలు ఆ ఊరిలో మరణాలకు కారణమేంటి? ఏదైనా క్షుద్రశక్తుల వల్ల చనిపోతున్నారా? లేదా ఎవరైనా కావాలనే చంపేస్తున్నారా? విచారణలో తెలిసిన షాకింగ్ నిజాలేంటి? ఊరి వారు తెలిపిన అభ్యంతరం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
