ప్రస్తుతం తెలుగు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో 'తండేల్' కూడా ఒకటి. డిసెంబర్ (క్రిస్మస్ సీజన్)లోనే రిలీజ్ అవుతుందని అనుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి నుంచే 'తండేల్' నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్లు షురూ చేశారు. తాజాగా 'తండేల్' సినిమాలోని రెండవ పాట రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు.
కాశీలో 'శివ శక్తి' సాంగ్ రిలీజ్
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'తండేల్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'కార్తికేయ' ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సెకండ్ సాంగ్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు చేశారు. 'శివ శక్తి' అనే టైటిల్ తో రాబోతున్న ఈ పాటను కాశీలో శివుడి సన్నిధిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. 'తండేల్' సినిమాలోని సెకండ్ సింగిల్ 'శివశక్తి'ని డిసెంబర్ 22న రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా నిర్మాతలు ప్రకటించారు. కాశీలోని దివ్యఘాట్ లో ఈ పాటను రిలీజ్ చేయబోతున్నారు.
'శివశక్తి' పాటను శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే పురాతన శ్రీముఖలింగం ఆలయాన్ని ప్రతిబింబించే విధంగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక విజువల్స్ పరంగా 'తండేల్' సినిమాకు ఈ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ జాతర సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాగచైతన్య, సాయి పల్లవి శక్తివంతమైన 'శివశక్తి' ఫోజులో దర్శనమిచ్చారు. అలాగే చుట్టుపక్కల జాతర వాతావరణం, జనాలు సంప్రదాయ దుస్తువుల్లో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిర్మాతలు ఈ పాటను భారీ స్థాయిలో, భారీ బడ్జెట్ తో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఈ పాట అత్యంత ఖరీదైనదని టాక్ నడుస్తోంది. కానీ ఈ పాటను తెరపై చూడాలంటే డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే.
'బుజ్జి తల్లి' పాటకి అదిరిపోయే రెస్పాన్స్
'తండేల్' సినిమాలోని నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ 'బుజ్జి తల్లి'కి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ క్లాస్ సాంగ్ ప్రేక్షకులకు స్లో పాయిజన్ లాగా రోజురోజుకి మరింత నచ్చుతోంది. 'బుజ్జి తల్లి' పాటను రిలీజ్ చేసి చాలా రోజులే అవుతోంది. అయినా కూడా ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పటిదాకా ఈ పాటకు 30 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న 'తండేల్' సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అంచనాలను పెంచేసింది. సినిమా మొత్తం ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. ఇందులో నాగ చైతన్య ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నారు. ఇక నాగ చైతన్య - సాయి పల్లవి డి- గ్లామర్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: బెయిల్‌పై బయటకొచ్చిన పవిత్ర గౌడ... ఆ గుడిలో దర్శన్ పేరు మీద ప్రత్యేక పూజలు - జనాల రియాక్షన్ ఏమిటంటే?