ఎవరు? సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కొత్త సినిమాకు దర్శకత్వం వహించబోయేది ఎవరు? లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మాణంలోని రజనీ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టేది ఎవరు? గత కొన్ని రోజులుగా అందరి మదిలో నెలకొన్న ప్రశ్నలకు సమాధానం లభించినట్లే. మన టాలీవుడ్ నాచురల్ స్టార్ నానితో సినిమా తీస్తాడని భావించిన శిబి చక్రవర్తి ఇప్పుడు రజనీకాంత్ సినిమాకు మెగా ఫోన్ పట్టబోతున్నారని చెన్నై సమాచారం.
తలైవర్ 173 డైరెక్టర్ ఫిక్స్...శిబి చక్రవర్తి దర్శకత్వంలో రజని!రజనీకాంత్ కథానాయకుడిగా కమల్ హాసన్ నిర్మాణంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అది రజని 173వ సినిమా కావడంతో అందరూ తలైవర్ 173 (Thalaivar 173) అని పిలవడం స్టార్ట్ చేశారు. తొలుత ఈ చిత్రానికి దర్శకుడిగా కమర్షియల్ సినిమాలతో భారీ వసూళ్లు సాధిస్తున్న సుందర్ సి ఎంపిక అయ్యారు. కమల్, రజనీతో కలిసి ఆయన దిగిన ఫోటోలను సైతం విడుదల చేశారు. అయితే క్రియేటివ్ పరమైన డిఫరెన్స్ రావడంతో ఆ సినిమా నుంచి సుందర్ సి తప్పుకొన్నారు.
Also Read: Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
సుందర్ సి వాకౌట్ చేసిన తర్వాత రజనీకాంత్ సినిమా డైరెక్టర్స్ రేసులో పలువురు పేర్లు వినిపించాయి. లోకేష్ కనకరాజు నుంచి కార్తీక్ సుబ్బరాజు వరకు చాలా మంది కథలను అటు కమల్, ఇటు రజని విన్నారని తెలిసింది. అయితే ఇప్పుడు చివరకు ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం శిబి చక్రవర్తి సొంతం చేసుకున్నారని చెన్నై టాక్. శివ కార్తికేయన్ కథానాయకుడిగా 'డాన్' సినిమా తీసి మంచి హిట్ అందుకున్నారు శిబి ఆ తరువాత నాచురల్ స్టార్ నాని హీరోగా సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. అది ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. అయితే ఈ లోపు రజని నుంచి పిలుపు రావడంతో ఆయన దగ్గరకు వెళ్లడం, కథ వినిపించడం, సినిమా ఓకే చేయించుకోవడం చకచకా జరిగాయి.
రజనీకాంత్, కమల్ హాసన్... తమిళ చిత్రసీమలో ఇద్దరూ ఇద్దరే. లెజెండరీ హీరోలు. కెరీర్ ప్రారంభంలో ఈ ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. తెరపై సందడి చేశారు. ఈ ఇద్దరి స్నేహం తెరు వెనుక కూడా కొనసాగింది. వీళ్ళిద్దరి కలయికలో గత ఏడాది సినిమా ప్రకటన రాగానే అభిమానులు అంతా ఎంతో సంతోషించారు. అయితే ఆ సినిమాలో కమల్ హాసన్ నటించడం లేదని, రజనీకాంత్ కథానాయకుడిగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారనే సమాచారం కాస్త నిరాశ కలిగించినా... సినిమాపై బజ్ మాత్రం బాగా పెరిగింది. ఇప్పుడు శిబి చక్రవర్తి ఎటువంటి సినిమా తీస్తాడోననే ఆసక్తి నెలకొంది. రజనీ సినిమా అంటే దర్శకుడు ఎవరైనా క్రేజ్ కామన్. మంచి ప్రొడక్ట్ వస్తే సూపర్ హిట్టే.