Telugu Film Chamber Elections Results Out : తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు సత్తా చాటారు. ఈ మేరకు ఫలితాలు వెల్లడయ్యాయి. నాలుగు విభాగాల కౌన్సిల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. మన ప్యానల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు బరిలో నిలిచారు.

Continues below advertisement

అధ్యక్షుడిగా సురేష్ బాబు

తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్‌తో ఆయన విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్, కోశాధికారిగా ముత్యాల రామదాసులు గెలుపొందారు. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ ప్యానల్ నుంచి 31, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలిచారు.

Continues below advertisement

టాప్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు 'ప్రొగ్రెసివ్ ప్యానల్'ను బలపరచగా... సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు 'మన ప్యానెల్'ను బలపరిచారు. నిర్మాతల సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు, మన ప్యానల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. ప్రొగ్రెసివ్ ప్యానల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు.

స్టూడియో సెక్టార్‌లో మన ప్యానల్ వారు ముగ్గురు ప్రొగ్రెసివ్ వారు ఒక్కరు రాగా... ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో 14 మంది ప్రొగ్రెసివ్ ప్యానల్ వారు గెలిచారు. మన ప్యానెల్ నుంచి ఇద్దరు సభ్యులు గెలుపొందారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో 12 ఈసీ మెంబర్స్‌‍కు గానూ.. ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది... మన ప్యానెల్ నుంచి 3 సభ్యులు గెలిచారు. ఓవరాల్‌గా 44 ఈసి మెంబర్స్‌లో ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు 28 ఓట్లు, మన ప్యానెల్‌కు 15 ఓట్లు వచ్చాయి. ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష సెక్రటరీ పదవులన్నీ ప్రొగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే‌ ఉండనున్నాయి.

Also Read : కన్నడలో బిగ్ సక్సెస్ - తెలుగు ప్రేక్షకుల ముందుకు '45 ది మూవీ'... రిలీజ్ ఎప్పుడంటే?

ఈ ఎన్నికలు ప్రతీ రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ప్రస్తుత కార్యవర్గ పదవీ కాలం ఈ ఏడాది జులైలోనే ముగిసింది. కొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ రాగా హైదరాబాద్ ఫిలింనగర్ ఆఫీస్‌లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలింగ్ కొనసాగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో 3,355 మంది సభ్యులు ఉండగా... ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం 2027 వరకూ కొనసాగనుంది. రాబోయే రెండేళ్ల పాటు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు థియేటర్ల సమస్యలు, నిర్మాతల మధ్య సమన్వయం, చిన్న సినిమాల ప్రోత్సాహం వంటివి ఈ బృందం చేతిలోనే ఉండనున్నాయి.