Telangana High Court Suspends OG Ticket Rates Hike Notice: రిలీజ్‌కు కొన్ని గంటల ముందు పవన్ కల్యాణ్ 'OG' మూవీకి షాక్ తగిలింది. టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. బెనిఫిట్ షో టికెట్ ధరలు కూడా పెంచొద్దంటూ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు సహా ఫస్ట్ 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దానికి బ్రేక్ పడింది.
అసలు రీజన్ ఏంటంటే?
పవన్ కల్యాణ్ 'OG' టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరగా అందుకు అంగీకరిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మెమోను మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. టికెట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చే అధికారి హోం శాఖ స్పెషల్ సీఎస్‌కు ఎలాంటి అధికారాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్‌కు మాత్రమే ఆ ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉందని చెప్పారు.
సామాన్యులకు వినోదం అందించే సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్. 'గేమ్ ఛేంజర్' సందర్భంగా హోంశాఖ అండర్ టేకింగ్ కూడా ఇచ్చిందని పిటిషనర్ తరఫు లాయర్ వివరించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది. అక్టోబర్ 9న తదుపరి విచారణ జరగనుంది.
టికెట్ రేట్స్ ఇలా...
బుధవారం రాత్రి ప్రీమియర్ షోలకు టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800గా నిర్ణయించారు. గురువారం నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకూ ఫస్ట్ 10 రోజులు మల్టీ ఫ్లెక్సుల్లో జీఎస్టీతో కలిపి రూ.150 వరకూ... సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.100 వరకూ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు నిర్ణయంతో ధరల పెంపునకు బ్రేక్ పడింది. మరి దీనిపై మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు, ఇంకొద్ది గంటల్లో ప్రీమియర్ పడనుండగా 'OG' థియేటర్ల వద్ద సందడి నెలకొంది.