Tabu In King 100: మహంతి ఝాన్సీ రాణి అనే నేను... నాగార్జున 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా టబు - గ్లింప్స్ చూశారా?
Tabu Glimpse King 100: నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న వందో సినిమా 'కింగ్ 100'. ఇందులో మహంతి ఝాన్సీ రాణిగా టబు నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Tabu First Look From King 100 Unviled: కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వందో సినిమా 'కింగ్ 100'. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆయన ఫస్ట్ గ్లింప్స్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఇవాళ సీనియర్ హీరోయిన్ టబు పుట్టినరోజు (Tabu Birthday) సందర్భంగా, 'కింగ్ 100'లో ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు.
మహంతి ఝాన్సీ రాణి అనే నేను...
రాజకీయ నాయకురాలిగా టబు పాత్ర!
'కింగ్ 100' సినిమాలో మహంతి ఝాన్సీ రాణి పాత్రలో టబు నటిస్తున్నారు. ఆమెది చాలా పవర్ ఫుల్ పొలిటీషన్ రోల్. సంప్రదాయ చీరకట్టులో, హుందాతనంతో, ఇంకా చెప్పాలంటే... రాయల్ లుక్కులో టబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రాజీపడని వ్యక్తిత్వం కలిగిన మహిళగా ఆమె పాత్రను తీర్చిదిద్దినట్టు చిత్ర బృందం పేర్కొంది. ఆమె బర్త్ డే గ్లింప్స్ చాలా పవర్ ఫుల్ గా ఉందని చెప్పవచ్చు.
Also Read: Srinath Maganti - శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ
"మనుషుల్లో రెండు రకాలు... హార్డ్ వర్క్ ని (తమ కష్టాన్ని) నమ్మేవాళ్ళు, లక్ ని (అదృష్టాన్ని) నమ్మేవాళ్ళు. ఐ హేట్ లక్ (నాకు అదృష్టం అంటే ఇష్టం ఉండదు)'' అని టబు వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత ఆమెను పరిచయం చేశారు... 'మహంతి ఝాన్సీ రాణి అనే నేను' అంటూ! దాంతో ఆమెది రాజకీయ నాయకురాలి పాత్ర అని అర్థం అవుతోంది.
Also Read: Ramayana Vs Scene - బుకింగ్స్‌లో 'రామాయణ' ఎదురీత... సూర్య 'సీన్' సేల్స్ ఎక్కువ
28 ఏళ్ల తర్వాత నాగార్జున సినిమాలో టబు
తెలుగు తెరపై విజయవంతమైన జంటలలో నాగార్జున - టబు జంట ఒకటి. దాదాపు 28 సంవత్సరాల తర్వాత మళ్లీ వాళ్లిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. గతంలో వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా' క్లాసిక్ స్టేటస్ అందుకుంది. అది బ్లాక్ బస్టర్ సినిమా. అందులో జంటగా నటిస్తే... ఇప్పుడు హీరో అండ్ విలన్ రోల్స్ చేస్తున్నారు. నాగార్జునతో ఢీ అంటే ఢీ అని ఢీకొట్టే ప్రతినాయకురాలిగా 'కింగ్ 100'లో టబు కనిపించబోతున్నారు.
'కింగ్ 100' చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయనకు తెలుగులో తొలి చిత్రమిది. ఇందులో నాగార్జునను స్టైలిష్ అవతారంలో చూపించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని కుటుంబం నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో ఐశ్వర్య రాజేష్, అశోక్ సెల్వన్, సుస్మితా భట్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాజా మహాదేవన్ సినిమాటోగ్రాఫర్. 'కింగ్ 100' చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















