Supreme Court Hearing Dil Raju Petition On Mr Perfect Controversy Issue: ప్రభాస్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మూవీ కాపీరైట్ వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) మంగళవారం విచారణ జరగనుంది. జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.
కాపీరైట్ చట్టం ప్రకారం కేసు..
'నా మనసు నిన్నుకోరే' అనే తన నవల ఆధారంగా 'మిస్టర్ పర్‌ఫెక్ట్' (Mr Perfect) సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో ఆయనపై మాదాపూర్ పోలీసులు కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సిటీ సివిల్ కోర్టులో విచారణ సాగింది. దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సిటీ సివిల్ కోర్టు 2019లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గత నెల 24న సిటీ సివిల్ కోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరగనుంది.
ఇక.. మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీ విషయానికొస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ హీరో హీరోయిన్లుగా.. యూత్, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ 2011లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దశరథ్ దర్శకత్వం వహించిన సినిమాలో ప్రకాష్ రాజ్, మురళీమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మూవీకే హైలెట్‌గా నిలిచింది.