Bollywood: బాలీవుడ్‌లో విషాదం... పాపులర్ నేపాలీ నటుడు మృతి... తేజా సజ్జా 'మిరాయ్'లో ఏ రోల్ చేశాడో తెలుసా?
Sunil Thapa Death: హిందీ చిత్రసీమ విషాదం చోటు చేసుకుంది. ప్రియాంక చోప్రా, మనోజ్ బాజ్ పాయ్ లతో నటించిన సునీల్ థాపా ఇకలేరు. 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

హిందీ చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. 'మేరీ కోమ్', 'ది ఫ్యామిలీ మ్యాన్' వంటి సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో కనిపించిన నేపాలీ నటుడు సునీల్ థాపా (Sunil Thapa) కన్ను మూశారు. ఆయన వయసు 68 ఏళ్లు. ఆయన మరణ వార్తను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) శనివారం ధృవీకరించింది. అన్నట్టు... తేజా సజ్జా హీరోగా నటించిన పాన్ ఇండియా హిట్ 'మిరాయ్: సూపర్ యోధ'లోనూ సునీల్ థాపా నటించారు. అందులో గ్యాన్ పూజ్రా పాత్ర పోషించారు.
సునీల్ థాపా ఎలా మరణించారు?
మరణానికి ఒక రోజు ముందు కూడా సునీల్ థాపా ఓ సినిమా షూటింగ్ చేశారు. ఆ సమయంలో ఆయన ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత హడావిడిగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. సునీల్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారని తెలుస్తోంది.
సంతాపం తెలిపిన CINTAA
ట్విట్టర్ (X) ఖాతాలో CINTAA ఈ మరణ వార్తను తెలియజేస్తూ... ''ప్రముఖ నటుడు శ్రీ సునీల్ థాపా ఫిబ్రవరి 7, 2026న మరణించారు. ఆయన మృతికి CINTAA సంతాపం తెలియజేస్తుంది. ఆయన శుక్రవారం రాత్రి వరకు 'రామ్ నామ్ సత్యో హో' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. చివరి వరకు సినిమాకు అంకితం అయ్యారు. మే 17, 1957న జన్మించిన సునీల్ థాపా నేపాలీ సినిమాకు చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది. ఆయన అంత్యక్రియలు ఫిబ్రవరి 8, 2026న జరుగుతాయి. ఆయన కుటుంబానికి, సినిమా ప్రపంచానికి మా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి'' అని పేర్కొంది.

సంతాపం తెలిపిన సిక్కిం ముఖ్యమంత్రి
సునీల్ మరణంపై సిక్కిం ముఖ్యమంత్రి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన ఫేస్‌బుక్‌లో సునీల్ ఫోటోను షేర్ చేస్తూ... ''ప్రముఖ నటుడు శ్రీ సునీల్ థాపా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా 'రత్ కైలా' పాత్రలో తన అద్భుతమైన నటనతో నేపాలీ సినిమాపై చెరగని ముద్ర వేశారు. ఆయన ప్రతిభ, వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతి. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలి'' అని రాశారు.
బాలీవుడ్‌లో సినిమాలు చేసిన సునీల్ థాపా
ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ బయోపిక్ 'మేరీ కోమ్'లో ప్రియాంక చోప్రాతో కలిసి సునీల్ థాపా నటించారు. ఆ సినిమాలో ప్రియాంక పోషించిన మేరీ కోమ్ పాత్రకు ఆయన కోచ్‌గా కనిపించారు. అలాగే, దానితో పాటు 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మూడవ సీజన్‌లో డేవిడ్ ఖుజోవా పాత్రలో కనిపించాడు. తేజా సజ్జా పాన్ ఇండియా సినిమా 'మిరాయ్'లో కూడా నటించారు.























