డిఫరెంట్ కాన్సెప్ట్, చిన్న హీరోలు, టాలెంట్ ఉన్న మేకర్స్‌ను ఎంకరేజ్ చేయడం కోసం పలువురు నిర్మాతలు.. ఒకటికంటే ఎక్కువగా ప్రొడక్షన్ హౌజ్‌లను మెయింటేయిన్ చేస్తున్నారు. అలాంటి వారిలో దిల్ రాజు కూడా ఒకరు. టాలీవుడ్‌లోనే మోస్ట్ పాపులర్ నిర్మాత అయిన దిల్ రాజుకు ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ ఉంది. అయినా కూడా ఇటీవల ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే పేరుతో మరో బ్యానర్‌ను ప్రారంభించాడు. దానికి తన కూతురు హర్షిత రెడ్డి ఓనర్‌గా వ్యవహరిస్తుండగా.. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌజ్ నుండి నాలుగో చిత్రం లాంచ్ జరిగింది. సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లాంచ్‌కు బడా దర్శకులు గెస్ట్‌లుగా హాజరయ్యారు.
చీఫ్ గెస్ట్‌లు హాజరు..
కంటెంట్ ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు హీరో సుహాస్. ఇప్పటికే తన చేతిలో పలు సినిమాలు ఉండగా.. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో మరో చిత్రం లంచ్ అయ్యింది. ఇందులో సుహాస్‌కు జోడీగా మలయాళ భామ సంకీర్తన విపిన్ నటించనుంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. దీని లాంచ్ కోసం ప్రశాంత్ నీల్, అనిల్ రావిపూడితో పాటు ‘బలగం’ ఫేమ్ వేణు కూడా చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. ముందుగా ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. వేణు.. మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశాడు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్‌తో పాటు దిల్ రాజు కూడా పాల్గొన్నారు.
ప్రశాంత్ నీల్ అసిస్టెంట్..
దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో తెరకెక్కనున్న ఈ నాలుగో సినిమాతో సందీప్ బండ్లా అనే యంగ్ డైరెక్టర్ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. ఇప్పటికే సందీప్ బండ్ల.. ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నాడు. ఇప్పటికే ‘బేబీ’ సినిమాకు మ్యూజిక్ అందించి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న విజయ్ బుల్గానిన్.. ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా అని మూవీ టీమ్ ఇప్పటికే రివీల్ చేసింది. అయితే తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక కథ రాలేదని, కథలో కొత్తదనం ఉంటుందని మేకర్స్ బయటపెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ లాంచ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చివరి దశలో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’..
ప్రస్తుతం సుహాస్.. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ యూట్యూబ్‌లో విడుదలయ్యి పాజిటివ్ రెస్పాన్స్‌ను సాధించింది. ఇందులోని పాటలు కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకోవడంతో తన తరువాతి ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడు సుహాస్. అలా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో హీరోగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటికే ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ లాంటి కథలతో ప్రేక్షకులకు దగ్గరయిన సుహాస్‌కు.. తన తరువాతి ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా బ్రేక్ ఇస్తుందని కంటెంట్ ఉన్న సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ భావిస్తున్నారు.
Also Read: వారసులు చేస్తే ఈ ప్రశ్న వేస్తారా? నాపై చిన్నచూపు ఎందుకు? - 'హనుమాన్' హీరో తేజా సజ్జ