Harom Hara Movie Shooting Wrapped Up: ఈరోజుల్లో స్టార్ హీరోలు మాత్రమే కాదు.. యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేస్తున్నారు. అందుకే హిట్ అయినా, ఫ్లాప్ అయినా చూసుకుందాం అన్నట్టుగా.. అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి హీరోల్లో సుధీర్ బాబు కూడా ఒకరు. తను చేసే మూవీ హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఏడాదికి కచ్చితంగా ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరోల్లో సుధీర్ బాబు కూడా ఒకరు. ఈ ఏడాది ఇంకా ఒక్క మూవీ గురించి ప్రకటించని సుధీర్.. తాజాగా తన అప్‌కమింగ్ సినిమా అయిన ‘హరోం హర’కు సంబంధించిన అప్డేట్‌ను బయటపెట్టాడు.


మరో అప్డేట్..


గత కొన్నిరోజులుగా సుధీర్ బాబు.. తన అప్‌కమింగ్ మూవీ ‘హరోం హర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి పోస్టర్, సాంగ్.. ఇలా ఏదో ఒక అప్డేట్ బయటికి వస్తూనే ఉంది. తాజాగా ‘హరోం హర’ షూటింగ్ పూర్తయ్యిందని సెట్‌లో మూవీ టీమ్ అంతా కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సినిమా సక్సెస్‌ఫుల్‌గా పూర్తవ్వడంతో మూవీ టీమ్ అంతా సంతోషంగా కేక్ కట్ చేశారు. ఇక ఈ వీడియోలో సుధీర్ బాబు కూడా ఉన్నాడు.


మాస్ సంభవం..


‘హరోం హర షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే థియేటర్లలో మంటపుట్టిస్తుంది’ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు మేకర్స్. అంతే కాకుండా రాయలసీమ యాసలో ‘త్వరలోనే థియేటర్లలో సుబ్రహ్మణ్యం మాస్ సంభవం సుసేకి సిద్ధంగా ఉండండా!’ అనే డైలాగ్‌ను కూడా వీడియోకు యాడ్ చేశారు. ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉండండని తెలిపారు. గతేడాదిలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.. ఇక ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తవ్వడంతో త్వరలోనే ట్రైలర్ కూడా వచ్చేస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.






అయిదు భాషల్లో సినిమా..


‘హరోం హర’ సినిమాను ఏకంగా అయిదు భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దానికి తగినట్టుగానే టీజర్‌ను కూడా అయిదు భాషల్లో విడుదల చేశారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషలో భారీ ఎత్తున ‘హరోం హర’ విడుదల కానుంది. ఈ సినిమాను 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్టుగా సమాచారం. జ్ఞానసాగర్ డైరెక్ట్ చేసిన ‘హరోం హర’లో సుధీర్ బాబుకు జోడీగా మాళవికా శర్మ నటించింది.



Also Read: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!