Srikanth Movie Is The Biopic Of Srikanth Bolla: బయోపిక్స్‌ తెరకెక్కించడంలో బాలీవుడ్ మేకర్స్ పీహెచ్‌డీ చేశారేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే చాలావరకు బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచే చిత్రాలన్నీ బయోపిక్సే అయ్యింటాయి. ఇప్పుడు మరో ఇన్‌స్పైరింగ్ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది బాలీవుడ్. అదే శ్రీకాంత్ బొల్లా కథ. శ్రీకాంత్ ఒక తెలుగబ్బాయే. అయితే, ఆయనపై ఒక సినిమాను తెరకెక్కించాలనే ఆలోచన టాలీవుడ్ మేకర్స్‌కు రాలేదు. కానీ బాలీవుడ్ దర్శకుడు తుషార్ హీరానందనికి వచ్చింది. రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కించిన ‘శ్రీకాంత్’ మూవీ మే 10న విడుదల కానుంది. దీంతో ఈ కథ ఎవరిది అని చాలామందిలో ఆసక్తి మొదలయ్యింది.


అస్సలు ఖర్చు లేకుండా..


ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబంలో జన్మించాడు శ్రీకాంత్ బొల్లా. తను పుట్టుకతోనే అంధుడిగా పుట్టినా చదువు విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. చిన్నప్పటి బ్రైట్ స్టూడెంట్‌గా ప్రశంసలు పొందేవాడు. తనకు సైన్స్ చదవాలనే కోరిక ఉన్నా.. తను అన్నింటిలో టాపర్ అయినా కూడా తనను జాయిన్ చేసుకోవడానికి ఒక ఇండియన్ స్కూల్ కూడా ముందుకు రాలేదు. తన టాలెంట్‌ను అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ గుర్తించి తనకు సీట్ ఇచ్చింది. ఒక బ్లైండ్ స్టూడెంట్‌ను పూర్తి ఆర్థిక సాయంతో ఒక్క రూపాయి తీసుకోకుండా మసాచుసెట్స్ యూనివర్సిటీ చదివించడం అదే మొదటిసారి. శ్రీకాంత్ టాలెంట్ ఎలాంటిదో చెప్పడానికి ఈ అడ్మిషనే నిదర్శనం.


చట్టం ఒప్పుకోలేదు..


శ్రీకాంత్ బొల్లా తన జీవితంలో ఎదుర్కున్న ఎన్నో ఇబ్బందులను, తను సాధించిన విజయాలను ‘శ్రీకాంత్’ అనే సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు రాజ్ కుమార్ రావు. ఇందులో అంధుడిగా నటించడానికి రాజ్‌కుమార్ ఎంతో కష్టపడ్డాడు. ఈ విషయం మూవీ టీజర్, ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక శ్రీకాంత్ బొల్లా నిజ జీవితంలో ఎదుర్కున్న ఇబ్బందుల విషయానికొస్తే.. తనకు సైన్స్, మ్యాథ్స్ చదవాలనే కోరిక ఉన్నా చట్టం తనను అనుమతించలేదు. బ్లైండ్ స్టూడెంట్ అవ్వడంతో సైన్స్‌లోని ఉండే గ్రాఫ్స్, డయాగ్రమ్స్‌ను డ్రా చేయడం కష్టమని బోర్డ్ తేల్చిచెప్పింది. అయినా శ్రీకాంత్ ఓటమిని ఒప్పుకోలేదు.


అమెరికాలో చదువు..



సైన్స్ చదవాలనే కోరిక తనను అందరికీ ఎదురువెళ్లేలా చేసింది. ఐఐటీలో కోచింగ్ ఇవ్వడానికి కూడా తనకు ఏ స్కూల్ ఒప్పుకోలేదు. ఇండియాలో ఐఐటీ చదవడానికి ఇక్కడ స్కూల్స్ ఒప్పుకోకపోతే అమెరికాలో చదివి చూపిస్తానని తనకు ఉన్న టాలెంట్‌తో అమెరికాలోని స్కూల్‌లో అప్లై చేశాడు. ఏకంగా అయిదు స్కూల్స్‌లో తనకు అడ్మిషన్ దొరికింది. దీంతో మసాచుసెట్స్ యూనివర్సిటీలో చదవాలని ఫిక్స్ అయ్యాడు. చదువులో మాత్రమే కాకుండా క్రికెట్, చెస్ లాంటి ఆటల్లో కూడా శ్రీకాంత్ చురుగ్గా ఉండేవాడు. 2012లో ఇండియాకు తిరిగొచ్చిన శ్రీకాంత్.. బోల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి దివ్యాంగులకు ఉపాది కల్పించాడు. అంతే కాకుండా 2021లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకటించిన యంగ్ గ్లోబల్ లీడర్స్ లిస్ట్‌లో కూడా స్థానాన్ని దక్కించుకున్నాడు.






Also Read: టైమ్ చూసి జగన్ మీద దెబ్బ కొడుతున్న టాలీవుడ్ - మాస్ రివేంజ్ షురూ!?