సినీ సెలబ్రిటీల పర్సనల్ జీవితాలపై ప్రేక్షకులు ఎక్కువగా ఫోకప్ పెడతారు. కానీ ప్రతీ సినీ సెలబ్రిటీ జీవితంపై అంత ఫోకస్ ఉండదు. కేవలం స్టార్ హీరోలు లేదా హీరోయిన్ల జీవితాల్లో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మాత్రమే ప్రేక్షకులు ప్రయత్నిస్తుంటారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల జీవితాల్లో కూడా చాలా బాధలు దాగి ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారు ఎన్నో సినిమాలకు ప్రాణం పోసినా.. వారి పర్సనల్ లైఫ్‌లోని బాధ గురించి తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు. తాజాగా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ బిజీగా ఉన్న శ్రీకాంత్ అయ్యంగార్.. తన పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టారు. తన భార్య, పిల్లలు తనకు దూరమయ్యారు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు.
అందరికీ దూరంగా..
శ్రీకాంత్ అయ్యంగార్‌ను ఆఫ్ స్క్రీన్ చూస్తున్నప్పుడే అర్థమయిపోతుంది.. ఈయన సమాజం వేసే ఉచ్చులో బ్రతకడానికి ఇష్టపడే వ్యక్తి కాదు అని, అంతే కాకుండా ఈయనతో 5 నిమిషాలు మాట్లాడితే ఆయన మనస్థత్వం ఏంటో తెలుస్తుంది అని. కానీ శ్రీకాంత్ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువమంది ప్రేక్షకులకు తెలుసు. ఆయన లైఫ్‌లో ఎంతో ట్రాజిడీ ఉన్నా.. అవన్నీ పట్టించుకోకుండా సిటీకి దూరంగా ఉన్న ఒక ఇల్లు తీసుకొని పెళ్లి, పిల్లలు, సంసారం అనే విషయాలకు దూరంగా, తన తమ్ముడితో కలిసి జీవిస్తున్నారు శ్రీకాంత్. ఆయన ఫ్యామిలీ గురించి అడగగా.. పెళ్లి, పిల్లలు అనే ప్రక్రియ తన వర్కవుట్ అవ్వలేదని ఓపెన్‌గా చెప్పేశారు.
పిల్లలతో ఏ కమ్యూనికేషన్ లేదు..
సమాజానికి నచ్చినట్టుగా బ్రతకడం తన వల్ల కాదు అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు. మనుషులు.. తాము చేయాలనుకున్నది చేయలేనప్పుడు ఫ్రస్ట్రేషన్‌లో కొన్ని రూల్స్ పెట్టారని, అదే సమాజంగా అందరూ ఫాలో అవ్వాలని చెప్తుంటారని అన్నారు. అలా తాను బ్రతకలేనని, అందుకే అందరికీ దూరంగా ఉంటానని తెలిపారు. అయితే ఇప్పుడు తన భార్య, పిల్లలు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించగా.. వారెవరూ తనకు టచ్‌లో లేరని అన్నారు శ్రీకాంత్. 2008లో తన భార్యతో విడిపోయానని, ఆ తర్వాత తన పెద్ద కూతురిని చూడడానికి ఒకట్రెండు సార్లు అమెరికా వెళ్లానని తెలిపారు. ఆ తర్వాత కూడా కొన్నిరోజులు కమ్యూనికేషన్ ఉన్నా.. మెల్లగా అది కూడా కట్ అయిపోయిందని, ఇప్పుడు తన భార్య, పిల్లల గురించి అసలు ఏమీ తెలియదని అన్నారు. కానీ అమెరికాలో ఉండే ఫ్రెండ్స్‌ను పిల్లలు ఎలా ఉన్నారని కనుక్కుంటూ ఉంటానని బయటపెట్టారు.
రెండో పెళ్లి కూడా వర్కవుట్ అవ్వలేదు..
పిల్లలను దూరం పెట్టాలని తనకు లేదని కానీ వారు దూరం పెట్టేంత తప్పు తాను చేయలేదని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ‘‘దూరం పెట్టిన తర్వాత రెండుసార్లు, మూడుసార్లు లేదా 10 సార్లు అడుగుతాను, దాని తర్వాత దొబ్బేయ్ అంటాను. నా మనస్థత్వం అలాంటిది అని’’ అన్నారు. మొదటి భార్యకు దూరమయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నానని అది కూడా వర్కవుట్ అవ్వలేదని శ్రీకాంత్ తెలిపారు. పలుమార్లు బాధపడిన తర్వాత ఎవరైనా నిజాయితీగా ప్రేమ అందించడానికి వచ్చినా నమ్మకం కుదరడం లేదని అన్నారు. సినీ పరిశ్రమలో అలాంటి వారు తనకు ఎవరూ ఎదురుపడలేదని, అంతా చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాం అని బయటపెట్టారు.
Also Read: ఎంతోమంది విడాకులకు మీరే కారణమన్న నెటిజన్, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏక్తాకపూర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial