Sri Ramadootha Stotram from HanuMan Movie: సంక్రాంతి బరిలో దిగనున్న ఎన్నో కమర్షియల్ సినిమాల మధ్య కంటెంట్ మీద నమ్మకంతో ఒక సూపర్ హీరో సినిమా కూడా విడుదల కానుంది. అదే ‘హనుమాన్’. ఒక యంగ్ డైరెక్టర్, యంగ్ హీరో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’.. జనవరి 12న విడుదల కానుంది. అందుకే మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఓవైపు దర్శకుడు ప్రశాంత్ వర్మ, మరోవైపు హీరో తేజ సజ్జా.. తమ సినిమా హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ‘హనుమాన్’ నుండి ‘శ్రీ రామదూత స్తోత్రం’ విడుదలయ్యింది.
‘హనుమాన్’ నుండి ‘శ్రీ రామదూత స్తోత్రం’..
దేవుడయిన హనుమంతుడిని సూపర్ మ్యాన్‌గా చూపిస్తూ.. ఆ సూపర్ మ్యాన్ పవర్స్ అన్నీ ఒక మనిషికి దక్కితే ఎలా ఉంటుంది అని చెప్పడమే ‘హనుమాన్’ కథ. ఈ మూవీలో తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటిస్తోంది. ఇక హీరోకు అక్క పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించింది. తమిళ నటుడు వినయ్ రాయ్.. ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్.. అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి సంక్రాంతి రేసులో నిలబెడుతున్నామని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా విడుదలయిన ‘శ్రీ రామదూత స్తోత్రం’ కూడా మూవీ లవర్స్‌ను మాత్రమే కాదు.. దైవభక్తులను కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
స్తోత్రమే పాటలా..
‘హనుమాన్’ సినిమాలో ఒక పాటకు విడుదలయిన ఈ శ్రీ రామదూత స్థోత్రాన్ని హనుమంత బడబనల స్తోత్రం నుండి తీసుకున్నారు. ఆ స్థోత్రాన్నే పాటగా మార్చి ‘హనుమాన్’లో చేర్చాడు మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి. ఇక శ్రీ చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఏడార, హర్షవర్ధన్ చావలి కలిసి ఈ స్థోత్రాన్ని చాలా ఇంటెన్సిటీతో పాడారు. కంటెంట్‌ను నమ్ముకొని వస్తున్న సినిమా కావడంతో ‘హనుమాన్’లో పెద్దగా పాటలు ఉండవని అర్థమవుతోంది. కానీ ఈ స్తోత్రం మాత్రం సినిమా రేంజ్‌లో వేరే లెవెల్‌కు చేర్చేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో చిరంజీవిని గ్రాఫిక్స్‌లో చూపించారని సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
హనుమాన్ స్టూడియో పేరుతో సెట్..
‘హనుమాన్’ మూవీ తక్కువ బడ్జెట్‌తోనే తెరకెక్కిన టెక్నికల్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ప్రశాంత్ వర్మ. అందుకే షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా కూడా చాలాకాలంగా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉండిపోయింది ఈ సినిమా. ‘హనుమాన్’ను షూట్ చేయడం కోసం హైదరాబాద్ చివర్లలోనే వట్టినాగులపల్లి అనే ప్రాంతంలో హనుమాన్ స్టూడియో అనే పేరుతో పెద్ద స్టూడియోను ఏర్పాటు చేశారు మేకర్స్. దాంతో పాటు పాడేరు, మారేడుమిల్లి ప్రాంతాల్లో కూడా షూటింగ్ జరిగిందని దర్శకుడు ప్రశాంత్ వర్మ బయటపెట్టాడు. ‘హనుమాన్’ కోసం కేవలం 120 రోజులు షూటింగ్ మాత్రమే జరిగినా.. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌కు మాత్రమే చాలా సమయం పట్టిందని మేకర్స్ రివీల్ చేశారు.
Also Read: ఫిమేల్ సూపర్ హీరో కూడా ఉంటుంది, ఇది ఇండియాలో జరిగే కథ కాదు - ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ