Rajkummar Rao's Ganguly Biopic Movie Shooting Updates: భారత ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) బయోపిక్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి తాజాగా కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం
బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) గంగూలీ బయోపిక్‌లో నటించనున్నారు. ఈ సినిమాకు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించగా.. లవ్ రంజన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బయోపిక్‌ను భిన్నంగా రూపొందించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.
ఫస్ట్ షెడ్యూల్ 2 నెలలు ఉంటుందని.. ఇప్పటికే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మూవీలో గంగూలీ జీవితంతో పాటు ఆయన క్రికెట్ కెరీర్‌ను సైతం చూపించనున్నట్లు సమాచారం. సాధారణంగా ఆటగాళ్ల బయోపిక్‌లపై వచ్చిన మూవీస్ కంటే ఇది భిన్నంగా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.
త్వరలోనే మరిన్ని అప్ డేట్స్
క్రికెట్‌లో రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన గంగూలీ.. 2008లో ఆటకు వీడ్కోలు పలికారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా.. ఆ తర్వాత మూడేళ్ల పాటు బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన జీవితం, క్రికెట్ కెరీర్‌ను బయోపిక్‌గా తీయాలని 2021 నుంచే పనులు మొదలుపెట్టారు. గంగూలీ రోల్ కోసం రణ్‌బీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా వంటి నటుల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత ఫైనల్‌గా రాజ్‌కుమార్ రావ్‌ను గంగూలీ బయోపిక్ కోసం ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించి ఇతర నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
రాజ్‌కుమార్ రావ్ గతేడాది 'స్త్రీ 2' సినిమాలో ప్రధాన పాత్ర పోషించగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. రూ.800 కోట్ల వసూళ్లతో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది. అంతకు ముందు ప్రముఖ బిజినెస్ మ్యాన్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలోనూ నటించి మెప్పించారు. తాజాగా గంగూలీ బయోపిక్‌లో నటించనున్నారు.
అయితే, వెండితెరపైకి క్రికెటర్ల బయోపిక్‌లు ఇంతకు ముందు కూడా వచ్చాయి. ఇప్పటివరకూ మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, మహ్మద్ అజహరుద్దీన్‌లపై బయోపిక్‌లు వచ్చి ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు గంగూలీ బయోపిక్ సైతం అంతే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఆకాంక్షిస్తున్నారు.