ఓటీటీ అనేది ఊపందుకుంటే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందని డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటినుండో వాపోతున్నారు. అందుకే కొంతకాలం క్రితం అందరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. ఒక సినిమా థియేటర్లలో విడుదలయిన 8 వారాల పాటు ఓటీటీలో విడుదల అవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అయినా కూడా కొన్ని సినిమాలు మాత్రం థియేటర్లలో విడుదలయిన రెండు వారాలకే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. చాలావరకు చిత్రాలు థియేటర్లలో విడుదలయిన నెలరోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ లిస్ట్‌లోకి శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ కూడా చేరనుంది.


మునుపటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్..
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్.. గత కొన్నేళ్లలో తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతోమంది మినిమమ్ తెలుగు మార్కెట్ ఉన్న తమిళ హీరోల లిస్ట్‌లో తాను కూడా చేరిపోయాడు. శివకార్తికేయన్ సినిమాలు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అవ్వడం మాత్రమే కాదు.. కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. తన చివరి చిత్రాలు ‘డాక్టర్’, ‘డాన్’ అయితే తెలుగులో కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘డాక్టర్’ అయితే కలెక్షన్స్ పరంగా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అందుకే అదే నమ్మకంతో తన తాజా చిత్రం ‘మహావీరుడు’ను కూడా తెలుగులో విడుదల చేశాడు శివకార్తికేయన్. కానీ పలు కారణాల వల్ల ఆ చిత్రం ఇక్కడ అంతగా గుర్తింపు సాధించలేకపోయింది.


శివకార్తికేయన్, అదితి శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మహావీరన్’.. తెలుగులో ‘మహావీరుడు’ అనే టైటిల్‌తో విడుదలయ్యింది. దీనికి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు, తమిళంలో జులై 14న విడుదలై పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. శివకార్తికేయన్ ఫ్యాన్స్ కూడా సినిమా బాగుందంటూ ప్రచారం చేశారు. ‘మహావీరుడు’ అంతంత మాత్రంగా ఆడడంతో అప్పుడే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్.


అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్..
‘మహావీరుడు’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 11 నుండి స్ట్రీమ్ కానుంది. థియేటర్లలో మూవీ కలెక్షన్స్, టాక్‌ను బట్టి ఓటీటీలో విడుదలయ్యే సమయం డిసైడ్ అవుతోంది. పెద్ద స్క్రీన్‌పై సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను వెంటనే ఓటీటీకి అందించడానికి మేకర్స్ సిద్ధంగా ఉండడం లేదు. కానీ కొంచెం అటుఇటుగా టాక్ వచ్చినా ఓటీటీనే బెస్ట్ అనే ఆలోచనలో ఉంటున్నారు. అందుకే ‘మహావీరుడు’ విడుదలయ్యి నెలరోజులు కాకముందే ఓటీటీలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శంకర్ కుమార్తె అదితి శంకర్‌కు మాత్రం హీరోయిన్‌గా గుర్తింపు మాత్రం రావడం లేదు. ఇప్పటికే తను రెండు సినిమాల్లో నటించగా.. అవి కనీసం మినిమమ్ గ్యారెంటీ హిట్ కూడా అవ్వలేదు. యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్, పాటలు లాంటివాటిలో చురుగ్గా ఉన్న అదితికి లక్ మాత్రం వరించడం లేదు.


Also Read: ‘కల్కి 2898 ఏడీ’ మళ్లీ వాయిదా? అసలు సంగతి చెప్పిన దర్శకుడు నాగ్ అశ్విన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial