కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న శివ కార్తికేయన్.. ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. అందులో 'మావీరన్' వంటి యాక్షన్‌ థ్రిల్లర్ కూడా ఉంది. తెలుగులో ‘మహావీరుడు’ అనే  పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోంది. దీనికి 'మండేలా' ఫేమ్ మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై మేకర్స్ కీలక ప్రకటన చేసారు. 


'మహావీరుడు' చిత్రాన్ని 2023 ఆగస్ట్ 11న తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. అయితే ఇప్పుడు నాలుగు వారాల ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించుకున్న మేకర్స్.. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు పోస్టర్ వదిలారు. నిజానికి శివ కార్తికేయన్ సినిమాని ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ చేస్తారని అందరూ ముందుగానే ఊహించారు. దీనికి కారణం అదే వారంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తుండటమే. 


నెల్సన్ దర్శకత్వంలో రజినీ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'జైలర్' చిత్రాన్ని ఆగస్టు 10న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు రీసెంట్ గా అధికారికంగా వెల్లడించారు. దీంతో పాటుగా తెలుగులో మెహర్ రమేష్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్' మూవీ కూడా రాబోతోంది. సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' కూడా ఇండిపెండెన్స్ డే వీక్ లో పాన్ ఇండియా మార్కెట్ మీద ఫోకస్ చేస్తోంది. ఇవన్నీ ఆలోచించి బాక్సాఫీస్ వద్ద క్లాష్ ని నివారించడానికి 'మహావీరుడు' మూవీని ప్రీపోన్ చేసారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉండటంతో జూలై 14న రిలీజ్ చేయాలని మేకర్స్ డెసిజన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 


'మహావీరుడు' సినిమాలో శివ కార్తికేయన్ సరసన డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో సునీల్, మిస్కిన్, యోగిబాబు, సరిత ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ భారీ బడ్జెట్ తో ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


 కాగా, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టీవీ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ కార్తికేయన్.. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నారు. నటుడిగానే కాదు సింగర్ గా, లిరిసిస్ట్ గా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. అంతేకాదు శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. ప్రతిభవంతులైన 


ఇక 'రెమో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ.. 'వరుణ్ డాక్టర్' 'కాలేజ్ డాన్' వంటి చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో 'ప్రిన్స్' అనే బైలింగ్విల్ మూవీ చేసినా, ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు 'మహావీరుడు' గా టాలీవుడ్ మార్కెట్ లోకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఇదే కాకుండా ఆయన నటిస్తున్న 'అయాలన్' అనే సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ ఈ ఏడాది దీపావళికి రాబోతోంది. అలానే కమల్ హాసన్ ప్రొడక్షన్ లో సాయి పల్లవితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు శివ. ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా SK21 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన సంగతి తెలిసిందే.