Nilave First Review: 'నిలవే' సినిమాకు సింగర్ సునీత రివ్యూ... మ్యూజికల్ లవ్ స్టోరీ గురించి ఏమన్నారంటే?
Nilave Review In Telugu: సౌమిత్ రావు పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన సినిమా 'నిలవే'. ప్రముఖ గాయని సునీత సినిమా చూశారు. కీరవాణి దగ్గరకు సంగీతం చేరేలా చేశారు. సినిమాకు ఆవిడ ఇచ్చిన రివ్యూ...

Nilave Movie Review In Telugu: ''ఇటీవల చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తుంటాం. అటువంటి కోవలోకి వస్తుందీ సినిమా. ఇందులో అన్నీ ఎమోషన్స్ ఉన్నాయి. కాలం మారినా ఇంటెన్స్ మ్యూజిక్ అలానే ఉంటుంది. ఈ రోజు నేను ఇక్కడ ఉండటానికి కారణం కూడా అదే'' అని సింగర్ సునీత అన్నారు.
సౌమిత్ రావు పోలాడి (Sowmith Rao Poladi), డాక్టర్ శ్రేయాసి సేన్ (Shreyasi Sen) హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా 'నిలవే'. హీరోగా నటించడంతో పాటు సాయి కె వెన్నంతో కలిసి చిత్రానికి దర్శకత్వం వహించారు సౌమిత్. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. సినిమాలో 11 పాటలు ఉన్నాయ్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వస్తుందీ సినిమా. అయితే ముందుకు ప్రీమియర్స్ వేశారు. సింగర్ సునీత సినిమా చూశారు. మరి, 'నిలవే' గురించి ఆవిడ ఏం చెప్పారో చదవండి.
'నిలవే' గురించి సునీత మాట్లాడుతూ... ''నేను ఈ సినిమా చూశా. అద్భుతమైన ఫొటోగ్రఫీ, దర్శకత్వం, నటీనటులు ఉన్న చిత్రమిది. అర్థవంతమైన సినిమా. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీని థియేటర్లలో ఆడేలా ప్రేక్షకులు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నా. క్లాసికల్ ఫిలిమ్స్ 'సఖి', 'ఏ మాయే చేసావె' తరహాలో ఫీల్ గుడ్ సినిమా. ఇందులో పాటలు బావున్నాయని ఓసారి కీరవాణి గారిని వినమంటే... ఆయన వినడంతో పాటు తన సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది'' అని అన్నారు.
తెలుగు సినిమాలో కథానాయికగా నటించినందుకు ఆనందంగా ఉందని శ్రేయాసి సేన్ తెలిపారు. 'నిలవే' చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని ఆమె చెప్పారు. నటుడు కావడానికి తనకు మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి అని హీరో సౌమిత్ రావు పోలాడి చెప్పారు. ప్రీమియర్లకు మంచి స్పందన రావడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. 'నిలవే' సంగీతాన్ని మెచ్చుకుని కీరవాణి గారి దగ్గరకు చేరేలా చేసిన సునీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్. సంగీత ప్రేమకథా చిత్రాల్లో 'నిలవే' కేజీఎఫ్ లాంటి సినిమా అని ఆయన అన్నారు.























