నటీనటులకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం మామూలు విషయం కాదు. కానీ శృతి హాసర్ ఈ ఏడాదిలోనే ఇద్దరు సీనియర్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2023 అనేది శృతి కెరీర్‌లోనే బెస్ట్ ఇయర్‌గా మారిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు హిట్స్ ఉన్నా... మూడో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతోంది శృతి. అదే ప్రభాస్‌తో కలిసి నటించిన ‘సలార్’. ఇక ఈ మూవీ విడుదలకు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండగా.. ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటోంది శృతి హాసన్. అలా సినిమా గురించి, ప్రభాస్ గురించి మాత్రమే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.


ఆధ్యా పాత్రపై క్లారిటీ..
ఇప్పటికే 2023లో రెండు హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఫీలింగ్ ఎలా ఉంది అని శృతిని అడగగా... ఈ ఏడాది తనకు ఒక రోలర్ కోస్టర్ రైడ్‌ అని చెప్పుకొచ్చింది. చివరికి వచ్చేసరికి పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ‘సలార్’లో తను పోషిస్తున్న ఆధ్యా పాత్ర గురించి కూడా శృతి బయటపెట్టింది. కథను, ప్రభాస్ చేస్తున్న దేవా పాత్రను పూర్తి చేసే విధంగా ఆధ్యా ఉంటుందని చెప్పింది. ఆధ్యాలో చాలా ఓపిక, సహనం ఉంటాయి. తను ఒక అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుపోతుంది. ఈ పాత్రను పోషించడం చాలా ఆసక్తికరంగా అనిపించిందని తెలిపింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, ప్రభాస్‌లతో పనిచేయడం ఎలా ఉందని తను అనుభవాలను షేర్ చేసుకుంది శృతి.


ప్రభాస్‌ను విసిగిస్తూ ఉంటాను..
‘‘ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేస్తున్నంతసేపు బెస్ట్‌గా అనిపించింది. తను చాలా అద్భుతమైన వ్యక్తి. తన విజన్, తను సృష్టించే ప్రపంచం, డైరెక్టర్‌గా తన పనితీరు.. అన్నీ అద్భుతంగా ఉంటాయి. నటులతో మాత్రమే కాదు.. యూనిట్‌లోని ప్రతీ ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతూ పనిచేయించుకుంటాడు. అలాంటి ఫిల్మ్ మేకర్‌తో పనిచేయడం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లాగా భావిస్తున్నాను’’ అని ప్రశాంత్ గొప్పదనం గురించి బయటపెట్టింది శృతి. ఆ తర్వాత ప్రభాస్‌తో సెట్స్‌లో ఎలా ఉండేది అని కూడా తెలిపింది. ‘‘ప్రభాస్‌లాంటి ఫ్రెండ్ నాకు ఉన్నాడని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. తనది చాలా మంచి మనసు. పని విషయంలో కూడా చాలా డెడికేషన్‌తో ఉంటాడు. ప్రతీ ఒక్కరు సినిమాలో పని చేస్తున్నందుకు సంతోషపడేలా చేస్తాడు. ప్రశాంత్ నీల్, ప్రభాస్‌లలో అదే కామన్ విషయం. నేను సెట్‌లో తనతో ఎక్కువైన అనవసరమైన విషయాలు మాట్లాడుతూ.. విసిగిస్తూ ఉంటాను. నేను తనతో జనరల్ నాలెడ్జ్ గురించి, మ్యూజిక్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని. తను నవ్వి ఊరుకునేవాడు. ప్రభాస్‌కంటే ఎక్కువగా నేనే మాట్లాడుతూ ఉండేదాన్ని’’ అని ప్రభాస్‌తో తన ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పుకొచ్చింది.


Also Read: 'కెజియఫ్'లో చేసిన తప్పే మళ్ళీ 'సలార్'కు...


అతడే నా బెస్ట్ ఫ్రెండ్..
ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ షాంతను హజారికాతో కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ చేసింది శృతి. దాని గురించి, షాంతనుతో తన రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రపంచంలో మొత్తంలో అతడే నా బెస్ట్ ఫ్రెండ్. అలాంటి మంచి మనిషితో పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా సమయం గడిపే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. తను చాలా క్రియేటివ్’’ అంటూ తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రశంసల్లో ముంచేసింది శృతి. దీంతో పాటు తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా రివీల్ చేసింది. ప్రస్తుతం అడవి శేష్‌తో కలిసి చేస్తున్న సినిమా గురించి స్పందించింది. ‘‘అడవి శేష్‌తో కలిసి నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇది ఒక ప్రేమకథ కానీ మనం ఎప్పుడూ చూసే ప్రేమకథలలాంటిది కాదు. స్క్రిప్ట్ చదవగానే ఈ సినిమా చేయాలి అని అనిపించింది’’ అని బయటపెట్టింది. అంతే కాకుండా తన హాలీవుడ్ సినిమా ‘ది ఐ’ రిలీజ్ గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ‘ది ఐ’ చిత్రం.. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో చక్కర్లు కొడుతుందని, త్వరలోనే థియేటర్లలో విడుదల అవుతుందని తెలిపింది శృతి హాసన్.


Also Read: హీరోయిన్ తమ్ముడ్ని వదిలేసి వ్యాపారవేత్తతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?