Rajendra Prasad's Shashtipoorthi Trailer Released: రూపేష్, ఆకాంక్షసింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'షష్టిపూర్తి'. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తుండగా.. నట కిరీటీ రాజేంద్రప్రసాద్, అలనాటి హీరోయిన్ అర్చన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది.
ఆసక్తికరంగా ట్రైలర్
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం నిర్వహించగా.. మూవీ టీంతో పాటు విజయవాడ ఈస్ట్ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ , పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 'మనం ఎవరో తెలియకుండానే ప్రేమించేది తల్లి.. తనకు తెలియని ప్రపంచాన్ని కూడా భుజాలపై ఎక్కించుకుని మరీ మనకు చూపించేది తండ్రి'.. అంటూ హీరో డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'సరిగ్గా లేని వాటిని సవరించడం నా కర్తవ్యం.. న్యాయాన్ని కాపాడటం నా వృత్తి' అంటూ హీరో క్యారెక్టరైజేషన్‌ను చెప్పే డైలాగ్.. ‘మనసుని కాకుండా మనిషి అలవాట్లను ప్రేమించే నువ్వు మార్పు గురించి మాట్లాడకు’ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో కథలోని ఎమోషన్ ఎలివేట్ చేస్తోంది.
రియల్ లైఫ్‌లో తప్పించుకున్నా..
ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. 'నేను నిజ జీవితంలో షష్టి పూర్తిని తప్పించుకోవాలని ప్రయత్నించాను. కానీ ఇలా సినిమా రూపంలో ‘షష్టి పూర్తి’ జరిగింది. అది నటుడిగా నా అదృష్టం. పెళ్లి సమయంలో నా పాటే.. చావు సమయంలో నా పాటే.. ఇక షష్టి పూర్తి టైంలో పాట లేదండి అని కొందరు అనేవాళ్లు. ఇప్పుడు ఆ ‘షష్టి పూర్తి’ పాట కూడా వచ్చింది. మళ్లీ ఆ పాటను ఇళయరాజా గారు చేయడం మరో అదృష్టం. ఇక పవన్ ప్రభ మ్యూజిక్ టేస్ట్ మామూలుగా ఉండదు. కీరవాణి గారితోనూ ఓ పాట రాయించుకున్నాడు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్ని చాటి చెప్పేలా మా చిత్రం ఉంటుంది. తల్లిదండ్రుల పెళ్లిని బిడ్డలు చూడలేరు.. అలా బిడ్డలు చూడగలిగే తల్లిదండ్రుల పెళ్లే మా ఈ ‘షష్టి పూర్తి’. అర్చనతో ఇన్నేళ్ల తరువాత కలిసి నటించడం ఆనందంగా ఉంది.' అని అన్నారు.
ఈ మూవీ చాలా స్పెషల్
'షష్టి పూర్తి' మూవీ మాకు చాలా స్పెషల్ అని హీరో హీరోయిన్లు రూపేష్, ఆకాంక్ష సింగ్ అన్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చనమ్మతో షూటింగ్ మా కుటుంబంతో ఉన్నట్లే ఉండేదని రూపేష్ అన్నారు. ఇంత మంచి కథ నా దగ్గరికి రావడం అదృష్టమని.. క్రెడిట్ అంతా దర్శకుడు పవన్ ప్రభదేనని తెలిపారు. రెండు దశాబ్దాల తర్వాత రాజేంద్రప్రసాద్ గారితో చేయడం చాలా అదృష్టమని హీరోయిన్ ఆకాంక్షసింగ్ అన్నారు. 'హీరోగా, నిర్మాతగా రూపేశ్ ఈ చిత్రానికి వంద శాతం న్యాయం చేశారు. అసలు ఈ రోజుల్లో ఓ సినిమా తీయడం, ముగించడం ఓ యాగం, విష పరీక్ష లాంటిది.' అని అన్నారు.
ఈ మూవీని MAA AAI ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ చౌదరి నిర్మిస్తుండగా.. 'కాంతార' ఫేమ అచ్యుత్ కుమార్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, మురళీధర్ గౌడ్, చలాకి చంటి, బలగం సంజయ్, మహిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు.