Sharwanand About Rohit Sharma Biopic: టాలీవుడ్‌లోని మినిమమ్ గ్యారెంటీ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. తను చేసే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చుతాయని మేకర్స్ బాగా నమ్ముతారు. ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు శర్వానంద్. అలాంటి మరో ఎమోషనల్ ఫ్యామిలీ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అదే ‘మనమే’. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనమే’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ తాజాగా జరిగింది. ఆ ఈవెంట్‌లో ఒక క్రికెటర్ బయోపిక్‌లో నటిస్తారా అనే ప్రశ్నకు శర్వానంద్ సమాధానమిచ్చాడు.


రోహిత్ శర్మతో పోలికలు..


మామూలుగా సినీ సెలబ్రిటీలను.. స్పోర్ట్స్ స్టార్స్‌తో పోల్చడం కామన్‌గా జరిగేదే. అలాగే శర్వానంద్‌ను చాలాసార్లు ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మతో పోల్చారు. ఒకవేళ రోహిత్ శర్మ బయోపిక్ తెరకెక్కిస్తే అందులో శర్వానంద్ బాగా సెట్ అవుతాడు అంటూ ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ‘మనమే’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శర్వానంద్‌కు అదే ప్రశ్న ఎదురయ్యింది. ఒకవేళ రోహిత్ శర్మ బయోపిక్ ఆఫర్ వస్తే నటిస్తారా అంటూ తనను ప్రశ్నించారు. వెంటనే ‘‘ఆలోచిస్తా’’ అంటూ సమాధానమిచ్చారు శర్వానంద్. ఇది విన్న శర్వా ఫ్యాన్స్.. వెంటనే ఈ బయోపిక్ వర్కవుట్ అయితే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..


శర్వానంద్ చివరిగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ వచ్చి దాదాపుగా రెండేళ్లు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ‘మనమే’లాంటి ఒక రిఫ్రెషింగ్ కథతో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతీ సమ్మర్ లాగా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఏమీ లేదు. అందుకే ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను కూడా మూసేశారు. అయినా అప్పుడప్పుడు సినిమాలు విడుదల అవుతూ ఉన్నా.. అవేమీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేలా లేవు. తాజాగా విడుదలయిన ‘మనమే’ ట్రైలర్ చూసిన తర్వాత ఇదొక కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు.


రెండేళ్ల తర్వాత..


2022లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేశాడు శర్వానంద్. అందులో ఒకటి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కాగా మరొకటి ‘ఒకే ఒక జీవితం’. అందులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ డిశాస్టర్‌గా నిలిచినా ‘ఒకే ఒక జీవితం’ మాత్రం టైమ్ ట్రావెలింగ్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో హిట్‌ను కొట్టాడు. మధ్యలో ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు శర్వా. అందులో ముందుగా తన కెరీర్‌లో 35వ చిత్రంగా ‘మనమే’.. ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై టీమ్ అంతా చాలా నమ్మకంతో ఉన్నారు. ఇది ఫ్యామిలీతో పాటు యూత్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు.


Also Read: గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది, ఆ విషయంలో సంతోషంగానే ఉన్నాను - కృతి శెట్టి