Shahid Kapoor: షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదేనా?
Sandeep Reddy Vanga - Animal Park Update: ప్రభాస్ 'స్పిరిట్' షూట్ బిజీలో ఉన్నారు సందీప్ రెడ్డి వంగా. దాని తర్వాత 'యానిమల్ పార్క్' చేయనున్నారు. అందులో కబీర్ సింగ్ వస్తాడా? షాహిద్ మాటలు అలాగే ఉన్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి తప్పుకొన్నారని వార్తలు రావడం, ఆయన స్పందించడం వంటివి తెలిసిన విషయాలే. అయితే... సందీప్ రెడ్డి వంగా గురించి హిందీ హీరో షాహిద్ కపూర్ ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. అది ఏమిటంటే...
ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన 'ఓ' రోమియో' సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్. ఆ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. అందులో ఆయనతో పాటు తృప్తి డిమ్రి కూడా కనిపించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్... రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్', తాను హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'కబీర్ సింగ్' క్రాస్ ఓవర్ గురించి జరుగుతున్న చర్చలపై స్పందించారు.
షాహిద్‌ను సంప్రదించిన సందీప్ రెడ్డి వంగా
షాహిద్ కపూర్ మాట్లాడుతూ... ''యానిమల్' షూటింగ్ సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నన్ను సంప్రదించారు. 'యానిమల్'లో కబీర్ సింగ్ పాత్రను కొద్దిసేపు చూపించాలనుకున్నారు. ఈ ఆలోచన యానిమల్ సినిమా చేసేటప్పుడు ప్రారంభంలో వంగాకు వచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్లాన్ ముందుకు సాగలేదు'' అని అన్నారు.
మెయిన్ ప్రాబ్లమ్... డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు
షాహిద్ కపూర్ మాట్లాడుతూ... ''యానిమల్' రూపొందుతున్నప్పుడు క్రాస్ ఓవర్ గురించి చర్చ జరిగింది. సందీప్ నన్ను కలిశాడు. అయితే, డేట్స్, ఇతర సమస్యల కారణంగా అది సాధ్యం కాలేదు'' అని తెలిపారు.
View this post on Instagram
కబీర్ సింగ్, యానిమల్... రెండూ సందీప్ రెడ్డి వంగా ఆలోచనల నుండి వచ్చిన పాత్రలేనని షాహిద్ కపూర్ స్పష్టం చేశారు. "ఆ రెండు పాత్రలూ అతనివే. ఆ ప్రపంచం అతనిదే. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు" అని షాహిద్ అన్నారు. అంటే... భవిష్యత్తులో క్రాస్ ఓవర్ జరిగితే... అది పూర్తి నిర్ణయం దర్శకుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 'యానిమల్ పార్క్'లో కబీర్ సింగ్ కనిపించినా కనిపించవచ్చు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'కబీర్ సింగ్' 2019లో విడుదలైంది. అందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించారు. అది 'అర్జున్ రెడ్డి' రీమేక్. హిందీలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అదే విధంగా 2023లో విడుదలైన 'యానిమల్'లో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మికా మందన్న, తృప్తి డిమ్రి నటించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది.























