Veteran Actress Sowcar Janaki Passed Away : సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. శ్వాస కోశ సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న షావుకారు జానకి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
గత రెండు రోజులుగా పరిస్థితి విషమించడంతో వైద్యులు షావుకారు జానకిని ఐసీయులో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. శుక్రవారం అత్యంత విషమంగా మారడంతో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆ సినిమానే ఇంటి పేరుగా...
ఏపీలోని రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్ 12న జన్మించారు. అసలు పేరు శంకరమంచి జానకి. ప్రముఖ నటి కృష్ణకుమారికి జానకి చెల్లెలు. చిన్నతనంలోనే నాటకాల్లో పలు పాత్రలు పోషిస్తూ... ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. 1943లో 'రక్షా రేఖ' సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె... 1950లో వచ్చిన 'షావుకారు' మూవీతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆ మూవీనే జానకి ఇంటిపేరుగా మారింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు షావుకారు జానకి.
తన కెరీర్‌లో 3 హిందీ సినిమాలు, ఒక మలయాళం చిత్రంతో మెప్పించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఆమెకు 2022లో పద్మశ్రీతో సత్కరించింది. 90 ఏళ్ల వయసులో షావుకారు జానకీ ఆ అవార్డు అందుకున్నారు. దీంతో పాటే రెండు నంది అవార్డులు కూడా అందుకున్నారు. 'వద్దంటే డబ్బు', 'కన్యాశుల్కం', 'పిచ్చి పుల్లయ్య', 'రేచుక్క పగటి చుక్క', 'రోజులు మారాయి', 'జయం మనదే', 'డాక్టర్ చక్రవర్తి', 'సంసారం ఒక చదరంగం', 'తోడికోడళ్లు', 'బాబు బంగారం', 'గీతాంజలి' మూవీస్‌లో నటించారు.
సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి
షావుకారు జానకి మృతి పట్ల తమిళ, తెలుగు ఇండస్ట్రీ పెద్దలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సహజ నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు కమల్ హాసన్, రాధిక తదితరులు షావుకారు జానకి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.
