సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో 3డీ టెక్నాలజీలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ డిజాస్టర్ గా మారింది. అయితే ఇందులో అప్సర మేనక పాత్రలో నటించిన సీనియర్ నటి మధుబాల తాజాగా సినిమా పరాజయం పాలవడంపై స్పందించింది.

 

'ఫైర్ ఫ్లైస్: పార్త్ ఔర్ జుగ్ను' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మధుబాల ఓ ఇంటర్వూలో శాకుంతలం సినిమా రిజల్ట్ పై ఓపెన్ అయింది. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో అంకితభావంతో నిజాయితీగా పని చేశారని తెలిపింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరీ అంత దారుణంగా ఫెర్ఫామ్ చేయడం తనకు హర్ట్ బ్రేకింగ్ గా అనిపించిందని పేర్కొన్నారు. సినిమా విజయం లేదా వైఫల్యం వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాన్ని ఎవరూ చెప్పలేరని మధుబాల అభిప్రాయ పడింది.

 

"దర్శక నిర్మాతలు చేయాల్సిందంతా చేసినా 'శాకుంతలం' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నేను చాలా బాధపడ్డాను. ప్రీ-ప్రొడక్షన్ నుండి రిలీజ్ అయ్యే వరకూ ఎలాంటి సందర్భంలోనూ వారు సినిమాని వదిలి పెట్టలేదు. షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ అయిన తర్వాత, వారు కంప్యూటర్ గ్రాఫిక్స్ మీదనే ఒక ఏడాది టైం స్పెండ్ చేశారు. వారు ఈ ప్రాసెస్ ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ని అందించాలనే ఆలోచించారు. షూటింగ్ సమయంలో, ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఎలాంటి ఒత్తిడి కలగకుండా చూసుకున్నారు. మా కంఫర్ట్ కోసం చాలా కేర్ తీసుకున్నారు" అని మధుబాల తెలిపింది.

 

"శాకుంతలం స్ట్రాంగ్ సౌత్ ఇండియా ఫ్లేవర్ ను కలిగి ఉంది. బాహుబలి, RRR సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా పనిచేసాయి. కానీ ఈ సినిమాల విజయం వెనుక కచ్చితమైన కారణం లేదు. బాహుబలి ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. సినిమా బాగున్నా, బిగ్ హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. శాకుంతలం బాక్సాఫీస్ వద్ద అండర్ పెర్ఫార్మ్ చేస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. అందరూ కష్టపడి చేసిన సినిమా కాబట్టి ఈ ఫలితం మమ్మల్ని బాధపెడుతోంది" అని మధుబాల చెప్పింది.

 

'శాకుంతలం' సినిమా కనీసం తెలుగు భాషలో అయినా బాగా ఆడాల్సిందని మధు బాల అభిప్రాయ పడింది. "పొన్నియిన్ సెల్వన్-1 సినిమా హిందీలో పెద్దగా ఆడలేదు, కానీ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిందీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. కానీ కనీసం ఒరిజనల్ లాంగ్వేజ్ లో ఆడియెన్స్ కు కనెక్ట్ అయిందని ప్రతీ ఒక్కరూ అనుకున్నారు. కానీ శాకుంతలం మాత్రం ఆ విషయంలో సక్సెస్ అవ్వలేదని నేను భావిస్తున్నాను" అని సీనియర్ నటి వివరించింది.

 

కాగా, కాళిదాసు రచించిన సంస్కృత నాటకం 'అభిజ్ఞాన శాకుంతలం' లోని శకుంతల - దుష్యంతుల ప్రేమగాథ ఆధారంగా "శాకుంతలం" సినిమా తెరకెక్కించారు గుణశేఖర్. ఇందులో సమంత టైటిల్ రోల్ ప్లే చేయగా.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించాడు. అల్లు అర్జున్ కూతురు అర్హ లిటిల్ భరతుడుగా తెరంగేట్రం చేసింది. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అనన్య నాగెళ్ల, జిషు షేన్ గుప్తా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. శేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

 

దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించింది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని భావించారు. రిలీజ్ కు ముందు సమంత, గుణ శేఖర్ లు విజయంపై ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలై అందరికీ నిరాశ మిగిల్చింది.